Lata Mangeshkar: లతాజీ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.. గాన కోకిలకు నివాళి అర్పించిన ఐరాస..
సంగీతానికి సరిహద్దుల్లేవని నిరూపిస్తూ తన మధురమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు ఇండియన్ నైటింగెల్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar).
సంగీతానికి సరిహద్దుల్లేవని నిరూపిస్తూ తన మధురమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు ఇండియన్ నైటింగెల్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar). 30 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్న ఈ గాన కోకిల.. ఇక తన గొంతు వినిపించలేనంటూ శాశ్వత సెలవు తీసుకున్నారు. కరోనా బారిన ముంబయి(Mumbai) లోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన ఆమె ఫిబ్రవరి 6న తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె అభిమానులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నీటి నివాళులు అర్పించారు. అదే రోజు సాయంత్రం ముంబయిలోని శివాజీ పార్క్ లో జరిగిన లతాజీ అంత్యక్రియల్లో ప్రధాని మోడీ ( PM Narendra Modi) తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు లతాజీతో ఉన్న మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
ఆమె భారత ఉపఖండపు గొంతు..!
తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్ (Antonio Guterres) లతాజీ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ‘భారత ఉపఖండపు గొంతు’ అని అభివర్ణించారు. అదేవిధంగా ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి లతాజీ మృతికి నివాళి అర్పిస్తూ ‘ ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం’ అని పేర్కొన్నారు. వీరితో పాటు ఐరాస ఉన్నతోద్యోగి అనితా భాటియా తదితరులు కూడా లతకు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. ఇక మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ట్విట్టర్ వేదికగా గాన కోకిలకు నివాళి అర్పించారు. ‘లతామంగేష్కర్ మరణవార్త నన్ను బాగా కలిచివేసింది. ఆమె సంగీతం సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి సంతోషాన్ని అందించింది. ఆమె మరణంతో భారతదేశం ఒక జాతీయ సంపదను కోల్పోయింది. లతాజీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ సంతాపం వ్యక్తం చేశారు.