Tollywood : ఆ డాన్స్ స్టెప్పులేంటి..? కొరియోగ్రాఫర్స్‌పై మహిళా కమిషన్ సీరియస్
ఈ మధ్య కాలంలో డాన్స్ ల పేరుతో పిచ్చి పిచ్చి స్టెప్పులేస్తున్నారంటూ చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సాంగ్స్ లో అసభ్యకర, అభ్యంతరకర డాన్స్ సెప్పుల పై సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. రీసెంట్ గా నితిన్ రాబిన్ హుడ్ సినిమాలోనూ అలాంటి డాన్స్ స్టెప్ ఒకటి ట్రోల్స్ బారిన పడిన విషయం తెలిసిందే..

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల వచ్చిన ఫిర్యాదుల మేరకు, కొన్ని సినిమాల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ మహిళలను కించపరిచేలా, అసభ్యకరంగా ఉన్నాయని గుర్తించింది. ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన కమిషన్, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు సహా సంబంధిత వర్గాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని కమిషన్ పేర్కొంది. మహిళలను తక్కువ చేసి చూపే లేదా అసభ్యకరంగా ప్రదర్శించే డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఎవరైనా ఈ హెచ్చరికను ఉల్లంఘిస్తే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని స్పష్టం చేసింది.
స్వీయ నియంత్రణ పాటించాలి
సినిమాలు, ముఖ్యంగా పాటలు, యువత మరియు పిల్లలపై ప్రభావం చూపుతాయని, అలాంటి అసభ్యకరమైన కంటెంట్ సమాజంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తుందని కమిషన్ పేర్కొంది. కాబట్టి, సినిమా రంగం స్వీయ నియంత్రణ పాటించి, సమాజానికి సానుకూల సందేశాలను అందించాల్సిన అవసరం ఉందని సూచించింది.
ప్రజల అభిప్రాయాల ఆహ్వానం
ఈ విషయంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చని సూచిస్తూ, దీనిపై నిశితంగా పరిశీలన కొనసాగిస్తామని తెలిపింది. అవసరమైన మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని కమిషన్ స్పష్టం చేసింది.
ఈ ప్రకటనతో సినీ పరిశ్రమలో చర్చలు మొదలయ్యాయి. దర్శకులు, కొరియోగ్రాఫర్లు తమ భవిష్యత్ ప్రాజెక్టుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సమాజంలోని అన్ని వర్గాలు మహిళల గౌరవాన్ని కాపాడే విధంగా సినిమాలు ఉండాలని కోరుకుంటున్నాయి.