Simbaa Review Telugu: మ‌ద‌ర్ నేచ‌ర్ కోసం సింబా ఏం చేశాడు?

వృక్షో ర‌క్ష‌తి ర‌క్షితః అని ఎక్క‌డైనా క‌నిపిస్తే, అలా చూసి ఇలా వెళ్లిపోతుంటాం. నిజానికి మ‌నుషుల జీవితాల్లో వృక్షాలు ఎలాంటి ప్రాధాన్యం క‌లిగి ఉన్నాయ‌న్న విష‌యాన్ని ఎప్పుడూ ఆలోచించం. తిండి లేక‌పోతే మూడు నాలుగు నెల‌లుండొచ్చు... నీళ్లు లేకుంటే మూడు నాలుగు రోజులుంటారేమో, అదే గాలి లేక‌పోతే ఒక్క నిమిషం కూడా బ‌త‌క‌లేడు మాన‌వుడు.

Simbaa Review Telugu: మ‌ద‌ర్ నేచ‌ర్ కోసం సింబా ఏం చేశాడు?
Simbaa
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 09, 2024 | 8:46 PM

సినిమా: సింబా

తారాగ‌ణం: జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ‌, క‌బీర్ సింగ్‌, శ్రీనాథ్‌, అనీష్ కురువిళ్ల‌, గౌత‌మి, క‌స్తూరి, దివి త‌దిత‌రులు

ద‌ర్శ‌కత్వం: ముర‌ళీమ‌నోహ‌ర్ రెడ్డి

ఇవి కూడా చదవండి

నిర్మాత‌లు: సంప‌త్ నంది, రాజేంద‌ర్

సంగీత ద‌ర్శ‌క‌త్వం: కృష్ణ సౌర‌భ్‌

వృక్షో ర‌క్ష‌తి ర‌క్షితః అని ఎక్క‌డైనా క‌నిపిస్తే, అలా చూసి ఇలా వెళ్లిపోతుంటాం. నిజానికి మ‌నుషుల జీవితాల్లో వృక్షాలు ఎలాంటి ప్రాధాన్యం క‌లిగి ఉన్నాయ‌న్న విష‌యాన్ని ఎప్పుడూ ఆలోచించం. తిండి లేక‌పోతే మూడు నాలుగు నెల‌లుండొచ్చు… నీళ్లు లేకుంటే మూడు నాలుగు రోజులుంటారేమో, అదే గాలి లేక‌పోతే ఒక్క నిమిషం కూడా బ‌త‌క‌లేడు మాన‌వుడు. అలాంటి గాలి కావాలంటే చెట్ల‌ను కాపాడుకోవాలి. ఆ విష‌యం ప్ర‌ధానంగా చెప్పే సినిమా సింబా. ఈ వారం విడుద‌లైన ఈ సినిమా విశేషాల గురించి చ‌దివేయండి…

క‌థ‌ : అనుముల అక్షిక (అన‌సూయ‌) స్కూల్ టీచ‌ర్‌. ఆమె భ‌ర్త మ‌హికి కాళ్ల ప‌నిచేయ‌వు. వాళ్ల‌కో పాప ఉంటుంది. వాళ్లిద్ద‌రి బాగోగులు చూసుకుంటుంది టీచ‌ర్‌. ఆ కాల‌నీలో అంద‌రికీ త‌ల్లో నాలుక‌లా ఉంటుంది. పొరపాటున కూడా ఎవ‌రికీ హాని చేయ‌దు. అలాంటి వ్య‌క్తి ఉన్న‌ట్టుండి ఓ వ్య‌క్తిని హ‌త్య చేస్తుంది. అలా ఒక‌టికి మూడు హ‌త్య‌లు చేస్తుంది. రెండో హ‌త్య‌లో ఆమెకు ఫాజిల్ (శ్రీనాథ్‌) సాయం చేస్తాడు. మూడో హ‌త్య‌లో వీరికి డాక్ట‌ర్ ఇరానీ(అనీష్ కురువిళ్ల‌) సాయ‌ప‌డ‌తాడు. అస‌లు వారంద‌రినీ వీళ్లు ఎందుకు హ‌త్య చేశారో పోలీసుల‌కు అంతుబ‌ట్ట‌దు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ల‌ను క‌నిపెట్టి అరెస్ట్ చేస్తారు. కానీ వాళ్లు త‌మ‌కేం తెలియ‌ద‌ని గ‌ట్టిగా చెబుతారు. పోలీస్ క‌స్ట‌డీలో వాళ్ల‌తో మాట్లాడిన సైకాల‌జిస్ట్ (గౌత‌మి) ఓ నిర్ణ‌యానికి వ‌స్తుంది. అది ఏంటి? ఈ ముగ్గురు హంత‌కుల‌కూ, ప్ర‌కృతిని కాపాడాల‌నుకునే పురుషోత్త‌మ‌రెడ్డి అలియాస్ సింబా (జ‌గ‌ప‌తిబాబు)కి ఏమిటి సంబంధం? పురుషోత్త‌మ‌రెడ్డి అల‌వాట్లు ఈ ముగ్గురికీ ఎందుకు వ‌చ్చాయి? అప్ప‌టిదాకా పురుషోత్త‌మ‌రెడ్డికి ప్రాణ స్నేహితుడిగా మెలిగిన వ్య‌క్తి ఎవ‌రు?అత‌ను ఏమ‌య్యాడు? పురుషోత్త‌మ‌రెడ్డి స‌తీమ‌ణి (క‌స్తూరి)కి పుట్ట‌బోయే బిడ్డ ఏమైంది? ఇవ‌న్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌ : న‌టీన‌టులంద‌రూ ఎవ‌రికి ఇచ్చిన పాత్ర‌ల్లో వాళ్లు బాగా చేశారు. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్న అన‌సూయ మంచి కేర‌క్ట‌ర్‌నే సెల‌క్ట్ చేసుకున్నారు. అనీష్ కురువిళ్ల‌కు ఈ త‌ర‌హా పాత్ర‌లు రొటీనే అయిన‌ప్ప‌టికీ ఈ మ‌ధ్య కాలంలో కాస్త స్క్రీన్ స్పేస్ ఎక్కువున్న కేర‌క్ట‌ర్‌లో చేశారు. ఫాజిల్ కేర‌క్ట‌ర్‌లో శ్రీనాథ్ ఒదిగిపోయాడు. దివితో అత‌నికున్న స‌న్నివేశాలను బాగా రాసుకున్నారు రైట‌ర్‌. ఈ మ‌ధ్య నెగ‌టివ్ కేర‌క్ట‌ర్ల‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్న జ‌గ‌ప‌తిబాబు… పురుషోత్త‌మ‌రెడ్డి కేర‌క్ట‌ర్‌లో ఫ్రెష్‌గా అనిపించారు. చాన్నాళ్ల త‌ర్వాత క‌స్తూరి స్క్రీన్ మీద మెప్పించారు. అయితే, పిండి కొద్దీ రొట్టె అన్న సామెత‌ను ఇక్క‌డ గుర్తుచేసుకోవాలి. ఆర్టిస్టులు చేయ‌డానికి రెడీగా ఉన్నా, డైర‌క్ట‌ర్ వాళ్ల‌ల్లో ప్ర‌తిభ‌ను రాబ‌ట్టుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నా, అక్క‌డ క‌థ‌, క‌థ‌నాల్లో బలం లేదు. చెట్ల‌ను బ‌తికించుకోవాల‌నే కాన్సెప్ట్ బావుంది. కానీ దాని చుట్టూ అల్లుకున్న క‌థ పేల‌వంగా ఉంది. ప్ర‌తి స‌న్నివేశం సాదా సీదాగా సాగింది. అన‌సూయ హ‌త్య చేసి ఇంటికి వెళ్లి, మామూలుగా క‌నిపించే ఒక‌ట్రెండు స‌న్నివేశాలు త‌ప్ప‌, ఏదీ ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించ‌దు. సినిమాలో బ‌ల‌మైన విల‌నీ లేదు. పైగా హ‌త్య‌కు పాల్ప‌డేవారికి ఒకే ర‌క‌మైన మేన‌రిజ‌మ్స్ పెట్ట‌డంతో, వాట‌న్నిటినీ జ‌గ‌ప‌తిబాబు కేర‌క్ట‌ర్‌లో ఆల్రెడీ ఊహించుకోగ‌లుగుతున్నారు ప్రేక్ష‌కులు.

సెల్యుల‌ర్ మెమ‌రీ, బ‌యోలాజిక‌ల్ మెమ‌రీ అనే కొత్త విష‌యాల‌తో కాన్సెప్ట్ ని డీల్ చేయాల‌నే త‌ప‌న‌తో, మిగిలిన విష‌యాల‌ను ప‌ట్టించుకోలేదేమో అనిపిస్తుంది. ఇన్వెస్టిగేష‌న్ స‌న్నివేశాల‌ను ఇంకా థ్రిల్లింగ్‌గా తెర‌కెక్కించాల్సింది. పురుషోత్త‌మ‌రెడ్డి ఆవేశాన్ని, ఆయ‌న న‌మ్ముకున్న ఆశ‌యాన్ని ఇంకా బ‌లంగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. విల‌న్లు రెండు నిండు ప్రాణాల‌ను తీసేంతగా ఎందుకు క‌సి పెంచుకున్నారో ఇంకాస్త ఇంటెన్స్ తో చెప్పాల్సింది. అలా కాకుండా, ప్ర‌తిదీ అలా జ‌రిగిపోతున్నంత తేలిగ్గా తీశారు. అక్క‌డే ప్రేక్ష‌కులు డిస్ క‌నెక్ట్ అయ్యాడేమో అనిపిస్తుంది.

వీట‌న్నిటికీ తోడు సినిమాలో చెప్పాల‌నుకున్న ప్ర‌ధాన విష‌యం… చెట్ల‌ను కాపాడ‌టం. ఆ విష‌యాన్ని దాచి సెకండ్ హాఫ్‌లో కూసింతకు ప‌రిమితం చేయ‌డం కూడా స్క్రీన్‌ప్లే లోప‌మేమో. ప‌గ తీర్చుకోవాల‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి ప్ర‌కృతిని ఎలా ప‌రిర‌క్షించుకోవాల‌నే విష‌యాన్ని మొద‌టి నుంచీ చెబుతూ వ‌స్తే బావుండేదేమో. సినిమాను చూస్తే, ఫ‌స్ట్ టైమ్ డైర‌క్ట‌ర్ తీసిన‌ట్టుగా అనిపించ‌దు. కాసింత అనుభ‌వం ఉన్న వ్య‌క్తి తెర‌కెక్కించిన భావ‌నే క‌లుగుతుంది. కాక‌పోతే, క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో ఇంకాస్త శ్ర‌ద్ధ తీసుకుంటే బావుండేది.

ఆఖ‌రిగా… ప‌గ ముందుకొచ్చి… ప్ర‌కృతి ప్రేమ ప‌క్క‌కెళ్లిందా?