Tragedy in Cricket: సెంచరీ తర్వాత ఊహించని ప్రమాదం.. 7 ఏళ్లుగా కోమాలో.. చివరకు
Akshu Fernando: 2018, డిసెంబర్ 28న అక్షు ఫెర్నాండో తన జట్టు సభ్యులతో కలిసి మౌంట్ లావినియా బీచ్ సమీపంలో శిక్షణ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్‌ప్రొటెక్టెడ్ (రక్షణ లేని) రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్షు తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు శరీరంలోని పలు చోట్ల ఎముకలు విరిగాయి.

Akshu Fernando: శ్రీలంక క్రికెట్‌లో తీరని విషాదం నెలకొంది. మాజీ అండర్-19 క్రికెటర్ అక్షు ఫెర్నాండో (25) మంగళవారం కన్నుమూశారు. 2018లో జరిగిన ఒక ఘోర రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అక్షు, గత ఎనిమిదేళ్లుగా కోమాలోనే ఉండి మృత్యువుతో పోరాడాడు. ఒక అద్భుతమైన కెరీర్ మొగ్గలోనే వాడిపోవడంతో క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
ఎన్నో ఆశలతో క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించి, దేశం గర్వించదగ్గ ఆటగాడిగా ఎదుగుతారని భావించిన శ్రీలంక యువ క్రికెటర్ అక్షు ఫెర్నాండో ప్రయాణం విషాదకరంగా ముగిసింది. సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు కోమాలో మృత్యువుతో పోరాడిన ఆయన, మంగళవారం తుదిశ్వాస విడిచారు.
ఆ రోజు ఏం జరిగిందంటే..?
2018, డిసెంబర్ 28న అక్షు ఫెర్నాండో తన జట్టు సభ్యులతో కలిసి మౌంట్ లావినియా బీచ్ సమీపంలో శిక్షణ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్‌ప్రొటెక్టెడ్ (రక్షణ లేని) రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్షు తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు శరీరంలోని పలు చోట్ల ఎముకలు విరిగాయి. అప్పటి నుంచి ఆయన లైఫ్ సపోర్ట్‌పైనే ఉండిపోయాడు. కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలతో ఆయన కోలుకుంటారని వేచి చూసినప్పటికీ, పరిస్థితి విషమించి మంగళవారం ఆయన కన్నుమూశాడు.
అక్షు ఫెర్నాండో శ్రీలంక అత్యుత్తమ ప్రతిభావంతులలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 2010లో న్యూజిలాండ్‌లో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో శ్రీలంక తరపున ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో 52 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కొలంబోలోని సెయింట్ పీటర్స్ కాలేజీ తరపున అద్భుతంగా రాణించాడు. అండర్-13 నుంచి అండర్-17 వరకు అన్ని జట్లకు నాయకత్వం వహించాడు.
రాగామ స్పోర్ట్స్ క్లబ్, కోల్ట్స్, పనాదుర వంటి ప్రతిష్టాత్మక క్లబ్‌ల తరపున ఆడాడు. ప్రమాదానికి కేవలం రెండు వారాల ముందు కూడా ఆయన అజేయంగా 102 పరుగులు సాధించడం గమనార్హం.
అక్షు మృతిపై అంతర్జాతీయ క్రికెట్ వ్యాఖ్యాత రోషన్ అబేసింఘే స్పందిస్తూ.. “అక్షు ఫెర్నాండో మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన ఒక అద్భుతమైన యువకుడు. ఒక క్రూరమైన ప్రమాదం ఒక గొప్ప కెరీర్‌ను చిదిమేసింది. ఆయన ఎప్పుడూ నవ్వుతూ, స్నేహపూర్వకంగా ఉండేవారు. అక్షు, నిన్ను మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాము” అని ఉద్వేగంగా ట్వీట్ చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




