
మూవీ రివ్యూ: టైగర్ నాగేశ్వరరావు
నటీనటులు: రవితేజ, నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, నాజర్, రేణు దేశాయ్, జిస్సు సేన్ గుప్తా తదితరులు తదితరులు
సంగీతం: జివి ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫీ: మధి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
రచన, దర్శకుడు: వంశీ
టైగర్ నాగేశ్వరరావు ప్రకటించిన రోజు నుంచి కూడా దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. దర్శకుడు వంశీ ఈ సినిమా కోసం మూడు నాలుగేళ్ల నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ఉన్నాడు. మరి ఆయన కష్టం ఫలించిందా..? నిజంగానే టైగర్ అటాక్ చేసిందా లేదా..? రవితేజకు ఈ సినిమా ఎంతవరకు కలిసొస్తుంది.. పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
టైగర్ నాగేశ్వరరావు (రవితేజ) స్టువర్టుపురంలో పుట్టి పెరిగిన వాడు. ఎలాంటి జాలి దయ లేని ఓ నరరూప రాక్షసుడు. అయితే ఆ రాక్షసుడిలో కూడా రాముడు ఉంటాడు. స్టువర్టుపురం ప్రజలకు ఉపాది లేక దొంగతనాలే వృత్తిగా బతుకుంటారు. వాళ్ల మీద పడి పొలిటీషియన్లు, పెత్తందార్లు జీవిస్తుంటారు. అదే సమయంలో ఆ ఊరు బతుకు మార్చాలనుకుంటాడు నాగేశ్వరరావు. దానికోసం ఆయనేం చేసాడు..? మధ్యలో ఆయనకు అడ్డొచ్చిన వాళ్లెవరు..? తను ప్రేమించిన సారా (నుపుర్ సనన్)ను ఎందుకు దూరం చేసుకున్నాడు..? ఆయన జీవితంలోకి మణి (గాయత్రి భరద్వాజ్) ఎలా వచ్చింది అనేది మిగిలిన కథ..
కథనం:
నాణేనికి రెండు వైపులు ఉన్నట్టు.. ప్రతి కథకు రెండు వర్షన్స్ ఉంటాయి.. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తుంటారు.. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయంలో వంశీ ఇదే చేశాడు.. ప్రపంచానికి కరుడుగట్టిన నిరసుడిగా తెలిసిన స్టువర్టుపురం దొంగ జీవితాన్ని.. రాబిన్ హుడ్ అంటూ అతనిలోని మరో కోణాన్ని చేశాడు. రావణుడిలోనూ రాముడు ఉంటాడని చూపించాడు. నాగేశ్వరరావు దొంగతనాలు, హత్యలు చేయడం వరకు తెలిసిన వాళ్లకు.. అసలు ఆయన ఎందుకలా చేయాల్సి వచ్చిందో.. నరరూప రాక్షసుడిగా మారడానికి కారణాలేంటో ఇందులో చూపించాడు. నిర్దాక్షిణ్యంగా తలలు నరికిన వాడి గుండె వెనుక ఉన్న మంటలను చూపించాడు. వంశీ ఈ సినిమాలో నిజాలు చూపించాడా లేదా అనే విషయం తెలియదు.. టైగర్ నాగేశ్వరరావు జీవితం గురించి కూడా పెద్దగా ఐడియా లేదు. సినిమా పరంగా చూసుకుంటే మాత్రం కంప్లీట్ రాబిన్ హుడ్ స్టోరీ ఇది. పెద్దోన్ని కొట్టు.. పేదోడికి పెట్టు ఫార్ములా.. ఫస్ట్ ఆఫ్ మొత్తం ప్రశ్నలు వేసి.. సెకండ్ హాఫ్ వాటికి సమాధానాలు చెప్పాడు దర్శకుడు వంశీ. తనవరకు సిన్సియర్ ప్రయత్నం చేసినా.. టైగర్ నాగేశ్వరరావుకు అతిపెద్ద అడ్డంకి లెంత్. మూడు గంటల నిడివి అంటే భరించడం కష్టం. ఫస్ట్ ఆఫ్ లో లవ్ ట్రాక్ ఆసక్తికరంగా అనిపించలేదు. సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి.. బయోపిక్ కాబట్టి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగానే తీసుకున్నాడు దర్శకుడు వంశీ. ఈ సినిమాను ఆయన డైరెక్ట్ చేసిన విధానం చూస్తే.. కథను ఎంత ఇష్టపడి, స్టడీ చేసి రాసుకున్నాడో అర్థమవుతుంది. చిన్న చిన్న డీటైలింగ్ కూడా మిస్ చేయలేదు.. కాకపోతే కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది..
నటీనటులు:
టైగర్ నాగేశ్వరరావు పాత్రకు రవితేజ పూర్తి న్యాయం చేశాడు. ఆ కారెక్టర్‌లో పూర్తిగా లీనం అయిపోయాడు. హీరోయిన్స్ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ అంతంతమాత్రంగానే ఉన్నారు. గ్లామర్ షో మాత్రం బాగానే చేసారు. నాజర్, జిస్సుసేన్ గుప్తా, అనుపమ్ ఖేర్ లాంటి వాళ్లు మెప్పించారు. మిగిలిన వాళ్లంతా ఓకే. చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ ఇందులో నటించారు. ఆమె చేసిన హేమలత లవణం పాత్ర బాగుంది. సోషలిస్ట్ పాత్రలో ఆమె బాగా నటించారు.
టెక్నికల్ టీం:
జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం బాగుంది. ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ వీక్ అనిపించింది. ముఖ్యంగా దర్శకుడు వంశీ ఆయనతో సరిగ్గా వర్క్ చేయించుకోలేదు. ఫస్టాఫ్, సెకండాఫ్‌లలో చాలా వరకు సన్నివేశాలు అదనగంగా అనిపించాయి. వాటిని తీసేసినా కథకు ఇబ్బంది రాదు.. అలాంటిది లెంత్ ఎక్కువైనా వాటిపై కత్తెర వేయకుండా అలాగే ఉన్నారేమో అనిపించింది. సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకు బలం. మధి చాలా సీన్స్ కెమెరా వర్క్‌తో మరింత రిచ్‌గా చూపించాడు. దర్శకుడు వంశీ బయోపిక్‌తో వచ్చాడు కాబట్టి కథను మార్చడానికి లేదు. కానీ చెప్పే కథను ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా చెప్పుంటే బాగుండేది. రాబిన్ హుడ్ తరహా కథలు చాలా వరకు వచ్చేయడంతో.. నాగేశ్వరరావు జీవితం ఇదే అయినా ఆసక్తికరంగా అనిపించలేదు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా టైగర్ నాగేశ్వరరావు.. లెంతీ రాబిన్ హుడ్ స్టోరీ..