Posani Krishna Murali: ఆంధ్రా నుంచి వచ్చాం.. వెళ్లిపోతాం అంటే కుదరదు కదా..? ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణపై పోసాని సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్ లు కనీసం 20 శాతం చేస్తే పన్ను రాయితీలు ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు సినిమా టిక్కెట్ ధరల పెంపుకు సంబంధించి కూడా ఏపీలో షూటింగ్ లు చేయాలని నిబంధన పెట్టారు. అయితే విభజన జరిగి సుమారు దశాబ్దం గడుస్తున్నప్పటికీ చెప్పుకోదగ్గ రీతిలో కూడా పరిశ్రమ ఏపీకి రాలేదు. అయితే ఏపీలో సినీ పరిశ్రమ తరలింపుపై రాష్ట్ర ఫిలిం, టీవీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10ఏళ్లు పూర్తికావొస్తున్నప్పటికీ.. తెలుగు సినీ పరిశ్రమ విషయంలో ఇప్పటికీ చర్చ జరుగుతూ వస్తోంది. ఏపీ – తెలంగాణగా తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత హైదరాబాద్‌లో ఉన్న సినీ పరిశ్రమను ఏపీలో కూడా విస్తరించేలా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సినీ పరిశ్రమ విస్తరణపై అనేక సార్లు చర్చలు జరిగాయి. మొత్తం పరిశ్రమ తరలిరాకపోయినా ఏపీలో కూడా సినీ పరిశ్రమ అభివృద్దికి జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని కీలక వ్యక్తులతో సీఎం జగన్ స్వయంగా చర్చలు జరిపారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, రాజమౌళితో పాటు పలువురు ప్రముఖులతో జగన్ మాట్లాడారు. అంతేకాదు ఏపీలో సినిమా షూటింగ్‌లు కనీసం 20 శాతం చేస్తే పన్ను రాయితీలు ఇస్తామని సైతం ప్రకటించారు. దీంతో పాటు సినిమా టిక్కెట్ ధరల పెంపునకు సంబంధించి కూడా ఏపీలో షూటింగ్‌లు చేయాలని నిబంధన పెట్టారు. అయితే, విభజన జరిగి సుమారు దశాబ్దం గడుస్తున్నప్పటికీ చెప్పుకోదగ్గ రీతిలో పరిశ్రమ ఏపీకి రాకపోవడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
ఈ తరుణంలో ఏపీకి సినీ పరిశ్రమ తరలింపు వ్యవహారంపై రాష్ట్ర ఫిలిం, టీవీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సినీ పరిశ్రమ తరలింపు, తదితర విషయాల్లో ఇబ్బందులున్నాయంటూ పోసాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ నగరానికి తరలివచ్చిన సమయంలో ఇబ్బంది పడలేదని పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించారు. మద్రాసు నుంచి విడిపోయిన సమయంలో పూర్తిగా తెలుగు, తమిళం వేర్వేరు కావున.. పరిశ్రమ తేలికగా హైదరాబాద్‌కు వచ్చిందన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లో పాతుకుపోయిన తెలుగు సినీ పరిశ్రమను అక్కడి నుంచి మార్చలేమంటూ పోసాని కృష్ణ మురళి చెప్పుకొచ్చారు. పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చలు జరిపి అనేక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పినట్లు పోసాని వివరించారు.
జగన్ హామీ ఇచ్చినా..
విశాఖపట్నంలో సినిమా స్టూడియోల నిర్మాణానికి ఎంత భూమి కావాలన్నా ఇస్తానన్నారని.. చిరంజీవి కూడా విశాఖలో స్టూడియోలు నిర్మాణం చేయాలని అప్పట్లో భావించారని పోసాని గుర్తుచేశారు. అంతేకాకుండా సినీ పరిశ్రమకు కావలసిన బ్యాంకు లోన్లు, స్టూడియోలకు భూములు, రీరికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు పోసాని తెలిపారు. కానీ పరిశ్రమ ఒక్కటేనని.. రెండూ తెలుగు రాష్ట్రాలు వేర్వేరని.. అందుకే అడగటానికి అవకాశం లేకుండా పోయిందన్నారు.
ఆంధ్రా నుంచి వచ్చాం కదా.. వెళ్లిపోతాం అంటే కుదరదు.. కదా..
ఆంధ్రా నుంచి వచ్చాం కదా.. వెళ్లిపోతాం అంటే కుదరదంటూ పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై చర్చజరిగితే.. తెలంగాణ సీఎం వెళ్లిపోవాలని అంటారని.. తమ స్థలాలు తమకు ఇచ్చేయాలని అంటారంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా.. సినిమా పరిశ్రమకు కావల్సిన భూములు ఇస్తున్నట్లు పోసాని వివరించారు. తెలంగాణలో కూడా 45 శాతం సినిమాలు ఆడుతున్నాయని.. అక్కడి నుంచి ఏపీకి వెళ్తామంటే తెలంగాణ సీఎంకు కోపం వస్తుందన్నారు. ఏపీకి వెళ్తే మా భూములు అప్పగించి వెళ్లండని అంటే.. అప్పుడు ఏం చేయాలంటూ ప్రశ్నించారు. అలాగని ఏపీకి వచ్చేయండి అన్నీ నేను చూసుకుంటానని సీఎం జగన్ కూడా చెప్పలేరని పేర్కొన్నారు. ఇలా.. అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న తెలుగు రాష్ట్రాలు కాబట్టి సినీ పరిశ్రమను హైదరాబాద్ నుంచి కదిలించడం కష్టమేనంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి