Mangalavaaram: మంగళవారం మూవీ ఫుల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి.. ఆ తర్వాత ఆ మ్యాజిక్ చేయలేదు. మహా సముద్రం ఫ్లాప్ కావడంతో.. దాదాపు మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని మంగళవారం సినిమాతో వచ్చాడు. మరి ఈ సినిమా ఆయన అంచనాలను నిలబెట్టిందా లేదా పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: మంగళవారం
నటీనటులు: పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత, అజ్మల్ అమీర్, ప్రియదర్శి, అజయ్ ఘోష్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్ తదితరులు
సినిమాటోగ్రఫర్: దాశరథి శివేంద్ర
ఎడిటర్: గుల్లపల్లి మాధవ్
నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అజయ్ భూపతి
ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి.. ఆ తర్వాత ఆ మ్యాజిక్ చేయలేదు. మహా సముద్రం ఫ్లాప్ కావడంతో.. దాదాపు మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని మంగళవారం సినిమాతో వచ్చాడు. మరి ఈ సినిమా ఆయన అంచనాలను నిలబెట్టిందా లేదా పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
మాహాలక్ష్మీపురంలో ఊరంతా గ్రామ దేవతను పూజిస్తుంటారు. అయితే అమ్మవారికి ఇష్టమైన మంగళవారం రోజు జంట ఆత్మహత్యలు జరుగుతాయి. ఆ తర్వాత మంగళవారం కూడా అలాగే మరో ఇద్దరు చనిపోతారు. ముందు ఆత్మహత్యలు అనుకున్న అవి హత్యలని తర్వాత తెలుస్తాయి. ఆ కేసును ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ మీనా (నందిత శ్వేత) ఇన్వెస్టిగేట్ చేస్తుంది. గ్రామ దేవత మాలచ్చమ్మకి కోపం రావడం వల్లే అలా చచ్చిపోతున్నారని గ్రామ ప్రజలు నమ్ముతారు. అయితే వాళ్ళు చనిపోయే ముందు రోజు ఊరి గోడలపై కొన్ని రాతలు కనబడతాయి. ఈ వరుస మరణాలకు కొన్నాళ్ళ ముందు ఊరంతా కలిసి వెలివేసిన శైలజ (పాయల్) కారణం అనుకుంటారు. అయితే అసలు శైలు ఎవరు.. ఊరిలో ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారు భార్య (దివ్యా పిళ్ళై) పాత్రలు ఏమిటి ..? శైలును ఊరి నుంచి ఎందుకు వెలివేస్తారు అనేది మిగిలిన కథ..
కథనం:
కొన్ని కథలు చెప్పడమే చాలా కష్టం. ఇక ఆ కథతో సినిమా చేయడం ఇంకా కష్టం. మంగళవారం సినిమాతో అజయ్ భూపతి ఇలాంటి రిస్క్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఇలాంటి ఓ కథను ఏ దర్శకుడు చెప్పే ధైర్యం చేయలేదు. ఐడియా మాత్రమే కొత్తది.. దాని కోసం ఎంచుకున్న నేపథ్యం, కథనం మాత్రం రొటీన్ గానే అనిపిస్తాయి. అనగనగా ఒక ఊరు.. మంగళవారం మాత్రమే జరిగే వరస హత్యలు.. ఇదే ఈ సినిమా కథ. దాన్ని వీలైనంత వరకు ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడు అజయ్ భూపతి. ఫస్టాఫ్ వరకు సక్సెస్ అయ్యాడు ఈ దర్శకుడు. కథ ఎక్కడా రిలీజ్ చేయకుండా కేవలం ఎపిసోడ్స్ తో లాక్కొచ్చాడు. తొలి 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. రీ రికార్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది.. జస్ట్ ఆ సౌండింగ్ తోనే థియేటర్ మార్మోగుతుంది. కీలకమైన సెకండాఫ్ మాత్రం గాడి తప్పింది. మరీ ముఖ్యంగా ఆయువు పట్టుగా నిలవాల్సిన పాయల్ రాజ్ పుత్ ఎపిసోడ్ డైజెస్ట్ చేసుకోవడం కష్టం. హీరోయిన్ కు ఇలాంటి క్యారెక్టరైజేషన్ పెట్టడం సాహసమే. సెకండాఫ్ 40 నిమిషాలు స్లో అనిపించినా.. చివరి 25 నిమిషాలు మాత్రం ట్రాక్ ఎక్కింది. పాయల్ రాజ్ పుత్ మరోసారి బోల్డ్ క్యారెక్టర్ చేసింది. ఇలాంటి రోల్ చేయడానికి చాలా గట్స్ కావాలి.. మహా సముద్రం ఫ్లాప్ తాలూకు కసి మంగళవారం సినిమాలో చూపించాడు అజయ్ భూపతి. చాలా వరకు సినిమాను జస్ట్ ఫ్రేమ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ తో నడిపించాడు దర్శకుడు. కొన్ని సీన్స్ అయితే బాగానే భయపెట్టాయి. ఓ చిన్న పాయింట్ చుట్టూ కథను అల్లుకున్నాడు అజయ్ భూపతి. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే సీక్వెల్ కు లీడ్ ఇచ్చి వదిలిపెట్టాడు దర్శకుడు.
నటీనటులు:
ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ క్యారెక్టర్ చూసిన తర్వాత.. ఇంతకంటే బోల్డ్ క్యారెక్టర్ ఆమె మళ్ళీ చేస్తుందో లేదా అనుకున్నారు. కానీ మంగళవారంలో అంతకంటే బోల్డ్ గా ఉండే పాత్ర చేసింది పాయల్. అలాంటి క్యారెక్టర్ చేయడానికి సాధారణంగా హీరోయిన్లు భయపడతారు. కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం శక్తి వంచన లేకుండా నటించింది. రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ కాసేపు అలా కనిపించి మాయమయ్యాడు. అజయ్ ఘోష్ క్యారెక్టర్ నవ్విస్తుంది. రవీంద్ర విజయ్ చేసిన డాక్టర్ క్యారెక్టర్ బాగుంది. నందితా శ్వేత పోలీస్ క్యారెక్టర్ లో పర్వాలేదు. జమీందారుగా చైతన్య కృష్ణ, ఆయన భార్యగా దివ్య పిల్లై పాత్రలు బాగున్నాయి. మిగిలిన వాళ్ళందరూ పాత్రల పరిధి మేర నటించారు.
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ ఇచ్చిన మ్యూజిక్ ప్రాణం. కాంతారకు ఎలాగైతే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోసాడో మంగళవారం సినిమాను కూడా నిలబెట్టాడు అజనీష్. ఎడిటింగ్ పర్లేదు సెకండ్ హాఫ్ కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. కానీ దర్శకుడి ఆప్షన్ కాబట్టి ఏం చేయలేం. సినిమాటోగ్రఫీ వర్క్ అదిరిపోయింది సినిమా రేంజ్ ను అమాంతం పెంచేసింది దాశరథి శివేంద్ర వర్క్. అజయ్ భూపతి దర్శకుడిగా 70% సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ తొలి అరగంట కాస్త ట్రాక్ తప్పిన కూడా మిగిలిన సినిమా బాగానే తెరకెక్కించాడు అజయ్. నిర్మాణ విలువలు బాగున్నాయి.
పంచ్ లైన్:
మంగళవారం.. ఆకట్టుకునే బోల్డ్ సస్పెన్స్ డ్రామా..
