Chiranjeevi: ఆ డైరెక్టర్లు అందరూ సైడ్.. ఊహించని వ్యక్తికి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఓకే చేసిన మెగాస్టార్
చిరంజీవి తర్వాతి సినిమా ఫిక్స్ అయిపోయిందా..? ఎవరూ ఊహించని దర్శకుడు లైన్‌లోకి వచ్చేసాడా..? రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా.. విజువల్ వండర్ వైపు చిరు అడుగులు పడుతున్నాయా..? పాన్ ఇండియా స్థాయిలో ఆయన ఆలోచనలు మారిపోతున్నాయా..? దానికోసమే బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌ను లైన్‌లోకి తీసుకొచ్చారా..? అసలు చిరు నెక్ట్స్ సినిమా ఏ దర్శకుడితో ఉండబోతుంది..?
చిరంజీవి తర్వాతి సినిమాపై చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. పూరీ జగన్నాథ్, త్రినాథరావు నక్కిన లాంటి కొందరు దర్శకుల పేర్లు వినిపించినా.. ఎవర్నీ కన్ఫర్మ్ చేయలేదు మెగాస్టార్. తాజాగా మెగా లిస్టులోకి మరో దర్శకుడు చేరిపోయారు. భోళా శంకర్ తర్వాత ఆయనతోనే చిరంజీవి సినిమా కన్ఫర్మ్ అనే వార్తలొస్తున్నాయి. ఆ దర్శకుడెవరో కాదు.. బింబిసార ఫేమ్ వశిష్ట. బింబిసారతో హాట్ టాపిక్ అయిపోయిన ఈ దర్శకుడు.. తన రెండో సినిమా కోసం చాలా మంది హీరోలను లైన్‌లో పెట్టారు. ఇప్పటికే బాలయ్యకు కథ చెప్పి ఒప్పించారు వశిష్ట. దాంతో పాటు రజినీకాంత్‌కు సైతం ఓ లైన్ చెప్పి ఓకే చేసుకున్నారు. కాకపోతే ఈ రెండు ప్రాజెక్టులు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. అనిల్ రావిపూడితో బాలయ్య.. జైలర్‌తో రజినీ మరికొన్నాళ్లు బిజీ.
బాలయ్య, రజినీ బిజీగా ఉండటంతో.. ఈ గ్యాప్‌లో చిరుకు లైన్ చెప్పి ఒప్పించినట్లు వార్తలొస్తున్నాయి. పైగా వశిష్ట చెప్పిన కథ చిరంజీవిని కూడా ఎగ్జైట్ చేసిందని.. అంజి తరహాలో సాగే ఫాంటసీ డ్రామా అని తెలుస్తుంది. హై రేంజ్ గ్రాఫికల్ వండర్‌గా దీన్ని తెరకెక్కించాలని ప్లానింగ్‌లో ఉన్నారు వశిష్ట. యువీ క్రియేషన్స్ దీన్ని నిర్మించబోతున్నారు.
చిరంజీవి కెరీర్‌లో అంజి తర్వాత విజువల్ బేస్ట్ సినిమా చేయలేదు. సైరా చేసినా.. అది పీరియాడికల్ డ్రామా. అందుకే వశిష్ట చెప్పిన లైన్‌కు వెంటనే చిరు ఓకే చేసారని తెలుస్తుంది. భోళా శంకర్ ఆగస్ట్ 11న విడుదల కానుంది. దీని తర్వాత వశిష్ట, చిరు ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. పక్కాగా చిరు తర్వాతి సినిమా ఇదే అనే వార్తలు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.