Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం రివ్యూ.. మాస్ యాక్షన్‏తో అదరగొట్టిన నితిన్..

అందులోనూ నితిన్ మొట్టమొదటిసారిగా ఒక కలెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు అనగానే ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుంది అనేది చూస్తే

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం రివ్యూ.. మాస్ యాక్షన్‏తో అదరగొట్టిన నితిన్..
Nithiin Movie
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Aug 12, 2022 | 1:39 PM

సినిమా రివ్యూ: మాచర్ల నియోజకవర్గం.

నటీనటులు: నితిన్, కృతిశెట్టి, కేథరిన్ ట్రెసా

దర్శకత్వం: ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి

సంగీత దర్శకుడు: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ల

నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు

విడుదల తేదీ : 2022 ఆగస్ట్ 12

నితిన్ (Nithiin) హీరోగా కృతి శెట్టి, కేథరిన్ థెరిసా హీరోయిన్లుగా గతంలో పూరీ జగన్నాథ్ దగ్గర ఎడిటర్ గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా మారి తెరకెక్కించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). చాలాకాలం తర్వాత నితిన్ హీరోగా డైరెక్ట్ థియేటర్లో వస్తున్న సినిమా కావడంతో పాటు టీం ప్రమోషన్స్ భారీగా చేయడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. అందులోనూ నితిన్ మొట్టమొదటిసారిగా ఒక కలెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు అనగానే ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుంది అనేది చూస్తే

కథ: ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల అనే నియోజకవర్గం చుట్టూనే సినిమా కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. రాజప్ప(సముద్రఖని) తండ్రి చనిపోగానే అతనికి సీటు ఇవ్వడానికి అధిష్టానం వెనకడుగు వేస్తే అధిష్టానం సీట్ ఇచ్చి పోటీ చేయించిన వ్యక్తిని చంపి రాజప్ప మాచర్ల నియోజకవర్గం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. అప్పటి నుంచి సుమారు ఐదు దఫాలు ఎలాంటి పోటీ లేకుండా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తాడు. అలాంటి సమయంలో సివిల్స్ రాసి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సిద్దార్థ్ రెడ్డి (నితిన్) పక్కింటికి వచ్చిన సంధ్య(కృతి శెట్టి) అనే అమ్మాయితో ప్రేమలో పడి ఆమె కోసం అదే మాచర్ల వెళతాడు. మాచర్లలో తన ప్రేయసి పరిస్థితి తెలుసుకుని షాకయ్యేలోపు నిధి(కేథరిన్) చేసిన పనికి అదే జిల్లాకు కలెక్టర్ అవుతాడు. 30 ఏళ్ల నుంచి ఎన్నికలే లేకుండా ఏకగ్రీవం అవుతుందనే విషయం తెలుసుకుని ఎన్నికలు జరిపేందుకు నిలబడతాడు. తన ప్రేయసి సంధ్య కోసం సిద్ధార్థ రెడ్డి ఏం చేశాడు? ఎన్నికలు జరిపాడా లేదా? ఆ ఎన్నికలలో రాజప్ప గెలిచాడా లేదా? చివరికి మాచర్ల నియోజకవర్గంలో కలెక్టర్ సిద్ధార్థ రెడ్డి ఏం చేశాడు? అనేది సినిమా కథ.

విశ్లేషణ:

ఎక్కువగా సాఫ్ట్ పాత్రలు లవర్ బాయ్ పాత్రలు చేస్తూ ఉండే నితిన్ ఈ చిత్రంలో అవుట్ అండ్ అవుట్ మాస్ పాత్రలో నటించడానికి ప్రయత్నించాడు. లవర్ బాయ్ తో మాస్ మసాలా మూవీ చేయడం ఒక్కటే సినిమాలో కొత్త పాయింట్. అయినా సరే సినిమాలో ప్రతి సీన్ ముందే ఊహించగలిగేలా ఉంటుంది. కథ రొటీన్ కావడంతో ప్రేక్షకులు ఎగ్జయిట్ అయ్యే అవకాశాలు తక్కువ. ఫస్ట్ హాఫ్ కథ అంతా విశాఖపట్నంలో నడుస్తుంది, ఇంటర్వెల్ కంటే ముందే మాచర్లకు షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో నితిన్ కంటే వెన్నెల కిషోర్ ఎక్కువ స్క్రీన్ మీద కనిపిస్తాడు. అయితే, కిషోర్‌ కామెడీ ఆకట్టుకుంటుంది. ప్రేయసి కోసం మాచర్లకు వెళ్లి రాజప్ప దురాగతాలను చూసి చలించిపోతాడు. ఇక అదే ప్రాంతానికి కలెక్టర్ గా వెళ్ళడంతో సెకండాఫ్ మొత్తం మాచర్లలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సింగిల్ లైన్ స్టోరీతో నడుస్తుంది. ఈ క్రమంలో సినిమా కధనం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో విఫలమైందనే చెప్పాలి. ఇక సినిమాలో అంజలి, నితిన్‌లపై చిత్రీకరించిన ఐటెం సాంగ్ వర్కౌట్ అయింది.

నటీనటులు:

కలెక్టర్ సిద్ధార్థ్‌గా నితిన్ గెటప్ అలాగే నటన బాగుంది. మాచర్ల లోకల్ అమ్మాయిగా కృతి శెట్టికి పవర్ ఫుల్ రోల్ అయితే దక్కలేదు. కేథరీన్ పాత్ర కూడా చాలా చిన్నది కానీ ఆమె కరెక్ట్ గానే సెట్ అయింది. మురళీ శర్మ, ఇంద్రజ నితిన్ తల్లిదండ్రులుగా తమ పరిధి మేర నటించారు. రాజేంద్రప్రసాద్ పాత్ర చిన్నదే అయినా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సముద్రఖని ద్విపాత్రాభినయంతో మాస్‌ని ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్‌కు మంచి రోల్ పడింది, జబర్దస్త్ లో మెరుస్తున్న మురారితో కలిసి కామెడీ పండించాడు.

ముగింపు:

ఈ సినిమా రొటీన్ అయినా ఫ్యామిలీతో కలిస్ ఒకసారి చూడచ్చు. నితిన్ మాస్ అవతార్ ఆకట్టుకునే విధంగా ఉంది. కొత్తదనం ఆశించే వారు కాస్త దూరంగా ఉండడం బెటర్.

ఇది కూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu