Naga Chaitanya: హిందీలో మరిన్ని సినిమాలు చేయబోతున్నారా ?.. చైతూ చెప్పిన సమాధానమేంటంటే..
ప్రస్తుతం నేను దక్షిణాది చిత్రపరిశ్రమలో స్థిరపడాలని అనుకుంటున్నాను. అలాగే హిందీలోనూ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను.
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అమీర్ ఖాన్, కరీనా కపూర్, చైతూ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. హాలీవుడ్ సూపర్ హిట్ ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల చేశారు. ఈ సినిమా తర్వాత చైతూ హిందీలో మరిన్ని సినిమాలు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. గతంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కార్యాలయం బయట కనిపించడంతో బాలీవుడ్ లో చిత్రాలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హిందీలో మరికొన్ని సినిమాలు చేస్తున్నారా ? అని అడగ్గా.. చైతూ ఆసక్తికర సమాధానమిచ్చారు.
బాలీవుడ్ చిత్రంలో ప్రధాన పాత్ర చేయడం కోసం తాను ఇంకా హిందీలో ఫర్ఫెక్ట్ కాదని అన్నారు. చైతూ మాట్లాడుతూ.. “ప్రస్తుతం నేను దక్షిణాది చిత్రపరిశ్రమలో స్థిరపడాలని అనుకుంటున్నాను. అలాగే హిందీలోనూ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను. కానీ హిందీలో నేను నిష్ణాతుడిని కాదు. నేను ఇప్పటికీ అభద్రతాభావంతో ఉన్నాను. ఒక తెలుగు కుర్రాడు.. భాష, శైలి పూర్తిగా సౌత్ ఇండియన్ అబ్బాయి మాదిరిగా ఉండాలని అమీర్ సర్ చెప్పారు. అందుకే లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాను. ఈ సినిమాతో హిందీలో మూవీ చేయడానికి నేను సరిపోతాను అని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.
లాల్ సింగ్ చద్దా సినిమాలో చైతూ బాలరాజు పాత్రలో నటించి మెప్పించాడు. చైతూ నటనకు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. “హిందీ చిత్రసీమలో ప్రేక్షకులు నన్ను ఎలా ఆదరిస్తారో చూడాలని ఉంది.. నాకు హిందీ సినిమాలు, విభిన్నమైన కంటెంట్‌ని అన్వేషించే విధానం నాకు చాలా ఇష్టం. ఈ పరిశ్రమ చాలా పెద్దది అలాగే చాలా భిన్నంగా ఉంటుంది. లాల్ సింగ్ చద్దా తర్వాత అవకాశాలు వస్తే తప్పకుండా హిందీలో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు.