AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పూర్తి స్థాయి హీరో లేడు.. కానీ 9 నంది అవార్డులు గెలుచుకున్న తెలుగు సంచలన చిత్రం..

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన అంతఃపురం, కథానాయకుడు లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకున్న కల్ట్ క్లాసిక్. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించి, ప్రకాష్ రాజ్, సౌందర్య, జగపతి బాబు వంటి నటీనటుల అద్భుత ప్రదర్శనలతో, తొమ్మిది నంది అవార్డులతో ఈ చిత్రం చరిత్ర సృష్టించింది.

Tollywood: పూర్తి స్థాయి హీరో లేడు.. కానీ 9 నంది అవార్డులు గెలుచుకున్న తెలుగు సంచలన చిత్రం..
Tollywood Film
Ram Naramaneni
|

Updated on: Feb 27, 2026 | 1:20 PM

Share

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ ప్రత్యేకత ఏమిటంటే, సినిమా నేపథ్యం ఎటువంటిది అయినా లోతుల్లోకి వెళ్లి చూపించడం, తెర మీద దాన్ని అందంగా ప్రెజెంట్ చేయడం. అందుకే ఆయన సినిమాల్లో భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయి. తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ మందికి గుర్తుండిపోయిన దర్శకులలో ఆయన ఒకరు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన మంచి చిత్రాల్లో అంతఃపురం ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు కథే హీరో. అందుకే ప్రత్యేకంగా ఓ హీరో అంటూ లేకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాకు దగ్గరగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ముఖ్యంగా రాయలసీమ కరుడుగట్టిన ఫ్యాక్షనిజాన్ని కృష్ణవంశీ ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించి, ఆ తర్వాత వచ్చిన ఫ్యాక్షన్ చిత్రాలకు ఒక రిఫరెన్స్ గా నిలిచారు. అంతఃపురం చిత్రం షూటింగ్ 1998 ఆగస్టు 12న హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాణ సారధ్యంలో చిత్రం రూపుదిద్దుకుంది.

ఈ చిత్రంలో నరసింహులు పాత్రను పోషించిన ప్రకాష్ రాజ్ గురించి చెప్పుకోవాలి. 34 ఏళ్ల ప్రకాష్ రాజ్ 60 ఏళ్ల వృద్ధుని పాత్రను పోషించారు. ఒంట్లో శక్తి లేకపోయినా పౌరుషానికి మాత్రం తక్కువ లేదనే కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ పాత్రను ఆయన అద్భుతంగా పోషించారు. మారిషస్ లో పెరిగిన ఒక అందమైన యువతి భానుమతి, మన దేశానికి వచ్చి కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటుంది. అనుకోకుండా ఫ్యాక్షన్ ఉచ్చులో చిక్కుకొని భర్తను కోల్పోతుంది. తన ప్రాణాలు, తన కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం భానుమతి చేసే పోరాటాన్ని కృష్ణవంశీ అద్భుతంగా తీశారు. తన నటనతో ఆ పాత్రకు వన్నె తెచ్చారు సహజనటి సౌందర్య. ఇక ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర సారాయి వీర్రాజు. ఈ పాత్ర పరిధి తక్కువే అయినా తన నటనతో అదరగొట్టేశారు జగపతి బాబు. గాయం సినిమా తర్వాత మళ్లీ అటువంటి రఫ్ క్యారెక్టర్‌ను అంతఃపురం చిత్రంలో పోషించారు జగపతిబాబు. గాయం చిత్రానికి కృష్ణవంశీ కో-డైరెక్టర్ గా పనిచేశారు. ఆ చనువు కారణంగానే కృష్ణవంశీ అడిగిన వెంటనే ప్రత్యేక పాత్ర పోషించడానికి జగపతి బాబు అంగీకరించారు. ఈ చిత్రం కోసం ఆయన 20 రోజులు పనిచేశారు. ఒకే మోడ్ లో సారాయి వీర్రాజు పాత్ర పోషించడం కోసం మరో సినిమా జోలికి పోకుండా 20 రోజులు వరుసగా పనిచేశారు. అంతేకాదు, అన్ని రోజులు ఇంటికి కూడా వెళ్లకుండా షూటింగ్ స్పాట్ లోనే ఆయన ఉండేవారు. అంతఃపురం చిత్రంలో ప్రకాష్ రాజ్ కొడుకుగా, సౌందర్య భర్తగా సాయి కుమార్ నటించారు. ఆయన పాత్రకు డైలాగులు తక్కువగా ఉంటాయి. అలాగే ప్రకాష్ రాజ్ భార్యగా ఊర్వశి శారద నటించారు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమె నటించిన చిత్రం ఇది. దర్శకుడు దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్ ఇందులో ప్రకాష్ రాజ్ అనుచరుడిగా నటించారు.

మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. “చిందేయ్ దరువెయ్యరా సాంబయ్యా”, “సూర్యుడి పువ్వా జాబిల్లి గువ్వా”, “అసలేం గుర్తుకురాదు” పాటలు పాపులర్ అయ్యాయి. పాటలన్నీ సీతారామశాస్త్రి రాశారు. ఎస్. జానకి పాడిన “సూర్యుడి పువ్వా” పాటకు ఉత్తమ గాయనిగా నంది అవార్డు వచ్చింది. 1998 నవంబర్ 30న అంతఃపురం చిత్రం విడుదల అయింది. సినిమాలో పూర్తి స్థాయి హీరో లేకపోయినా ఒక అగ్ర హీరో చిత్రానికి వచ్చే ఓపెనింగ్స్ ఈ సినిమాకు వచ్చాయి. దానికి ముఖ్య కారణం దర్శకుడు కృష్ణవంశీ. ఈ చిత్రం ఘనవిజయం సాధించడమే కాకుండా తొమ్మిది నంది అవార్డులు పొందడం విశేషం. ఉత్తమ నటిగా సౌందర్య స్పెషల్ జ్యూరీ అవార్డును, ఆమెకు డబ్బింగ్ చెప్పిన సరిత ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవార్డును అందుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా జగపతి బాబు, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రకాష్ రాజ్, ఉత్తమ సహాయ నటిగా తెలంగాణ శకుంతల ఈ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. అలాగే జాతీయ స్థాయిలో ప్రత్యేక ప్రశంస నటునిగా ప్రకాష్ రాజ్ అవార్డు పొందారు.

(ఈ కథనం సీనియర్ ఫిల్మ్.. జర్నలిస్ట్‌లు అందించిన సమాచారం మేరకు ఇచ్చాం)

Also Read: ‘ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు’.. సునీల్‌పై హీరో ఆకాష్ సంచలన ఆరోపణలు

Follow Us