Venkatesh: ఆ మూవీపై వెంకటేష్ షాకింగ్ నిర్ణయం.. రీమేక్ నుంచి తప్పుకున్నారా..?
Drishyam 3 Movie Update: ‘దృశ్యం’ సిరీస్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసిన విక్టరీ వెంకటేష్… ఇప్పుడు ‘దృశ్యం 3’ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. మొదటి రెండు భాగాల్లో రాంబాబుగా మెప్పించిన వెంకీ, మూడో భాగం తెలుగు రీమేక్ నుంచి తప్పుకున్నారన్న ప్రచారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ భవితవ్యంపై ఆసక్తి నెలకొంది.

టాలీవుడ్ ప్రేక్షకులకు ‘దృశ్యం’ సిరీస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మలయాళంలో మోహన్ లాల్ చేసిన మ్యాజిక్ ను తెలుగులో విక్టరీ వెంకటేష్ తనదైన శైలిలో రీక్రియేట్ చేశారు. రాంబాబుగా ఆయన నటన, ఆ కుటుంబం చుట్టూ అల్లిన సస్పెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దృశ్యం, దృశ్యం 2 సూపర్ హిట్ కావడంతో.. అందరి కళ్లూ ఇప్పుడు ముగింపు భాగమైన ‘దృశ్యం 3’ పైనే పడ్డాయి. అయితే ఈ సక్సెస్ ఫుల్ సిరీస్ కు తెలుగులో బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో ఓ వార్త గట్టిగా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘దృశ్యం 3’ తెలుగు రీమేక్ నుంచి వెంకటేష్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి రెండు భాగాల్లో తన భుజాలపై సినిమాను నడిపించిన వెంకీ.. మూడో భాగం విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. వెంకటేష్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా కొన్ని వ్యాపార, మార్కెట్ లెక్కలే కారణమని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మలయాళంలో తెరకెక్కుతున్న ‘దృశ్యం 3’ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అయితే ఈసారి ఈ సినిమాను కేవలం మలయాళానికే పరిమితం చేయకుండా, ఏకకాలంలో తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేయాలని చిత్ర బృందం గట్టిగా భావిస్తోందట. తెలుగులో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు నేరుగా డబ్బింగ్ తోనే పలకరించబోతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా ట్రెండ్, ఓటీటీల పుణ్యమా అని మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. ఆయన మార్కెట్ కూడా ఇక్కడ బాగా విస్తరించింది.
ఇలాంటి సమయంలో, మలయాళం వెర్షన్ నే నేరుగా తెలుగులో రిలీజ్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని, అదే కథను మళ్లీ ప్రత్యేకంగా రీమేక్ చేసి వందల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల పెద్దగా కమర్షియల్ ప్రయోజనం ఉండదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే విషయాన్ని వెంకటేష్ కూడా అంగీకరించినట్లు సమాచారం. మోహన్ లాల్ సినిమాను తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేసి అందరూ చూసేసిన తర్వాత, మళ్లీ దానినే ఇక్కడ రీమేక్ చేయడం వ్యాపారపరంగా వర్కౌట్ కాదని ఆయన భావిస్తున్నారని తెలుస్తుంది. అందుకే ‘దృశ్యం 3’ రీమేక్ చేయకపోవడమే మంచిదని వెంకీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా థ్రిల్లింగ్ ఎండ్ తో ముగిసే ఈ సిరీస్ లో రాంబాబు పాత్రను మిస్ అవ్వడం వెంకీ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే..!
