AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం దిగుమతులపై కఠిన ఆంక్షలు! FTA దుర్వినియోగానికి చెక్ పెట్టిన కేంద్రం

కేంద్రం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. DGFT నోటిఫికేషన్ ప్రకారం, FTAల దుర్వినియోగాన్ని అరికట్టడం, దేశీయ పరిశ్రమను రక్షించడం లక్ష్యం. ఈ నిర్ణయం ఆభరణాల మార్కెట్, చిల్లర ధరలపై ప్రభావం చూపనుంది. ముందస్తు ఒప్పందాలకు సైతం ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.

బంగారం దిగుమతులపై కఠిన ఆంక్షలు! FTA దుర్వినియోగానికి చెక్ పెట్టిన కేంద్రం
Gold
SN Pasha
|

Updated on: Apr 06, 2026 | 1:31 PM

Share

దేశంలో బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక విధాన నిర్ణయం తీసుకుంది. DGFT(డైరెక్టరేట్ జనరల్ అఫ్ ఫారిన్ ట్రేడ్) జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం విలువైన లోహాలతో తయారైన అన్ని రకాల వస్తువుల దిగుమతులపై తక్షణమే కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAs) దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం వెల్లడించింది. నోటిఫికేషన్ ప్రకారం ఈ పరిమితులకు ఎటువంటి మినహాయింపులు ఉండవు. ఇప్పటికే ఒప్పందాలు కుదిరినా, లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసినా, ముందస్తు చెల్లింపులు జరిగినా లేదా సరుకులు రవాణాలో ఉన్నా అన్ని సందర్భాల్లోనూ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దీంతో దిగుమతిదారులు ముందుగా చేసిన ఏర్పాట్లకు కూడా ఈ ఆంక్షలు వర్తించనున్నాయి.

ఈ నిర్ణయం ITC (HS) కోడ్‌లోని చాప్టర్ 71 కింద వచ్చే ఉత్పత్తులన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఇందులో ముత్యాలు, రత్నాలు (విలువైనవి, పాక్షిక విలువైనవి), బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలు, వాటితో తయారైన ఆభరణాలు, పూత పూసిన వస్తువులు, అనుకరణ ఆభరణాలు, కరెన్సీ వంటి అంశాలు ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశంగా ఉండటంతో, ఈ నిర్ణయం ఆభరణాల పరిశ్రమపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. దిగుమతులపై నియంత్రణ పెరగడంతో బులియన్ మార్కెట్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా చిల్లర బంగారం, వెండి ధరలపై కూడా ప్రభావం పడవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఈ చర్య వెనుక ప్రధాన కారణం FTAల దుర్వినియోగం. కొంతమంది దిగుమతిదారులు భాగస్వామ్య దేశాల ద్వారా లోహాలను తక్కువ సుంకంతో తీసుకువచ్చి, స్వల్ప మార్పులు చేసి సుంక మినహాయింపులను పొందుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ విధానం దేశీయ పరిశ్రమకు నష్టం కలిగించడమే కాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని కూడా తగ్గిస్తోంది. కొత్త ఆంక్షల ద్వారా చట్టబద్ధమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, దిగుమతులపై కట్టుదిట్టమైన నియంత్రణ సాధించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us