Jamuna: తెలుగువారి సత్యభామ, సీనియర్ నటి జమున కన్నుమూత

అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని మెప్పించిన తొలి తరం నటి జమున ఇక లేరు.

Jamuna: తెలుగువారి సత్యభామ, సీనియర్ నటి జమున కన్నుమూత
Jamuna
Follow us

|

Updated on: Jan 27, 2023 | 9:06 AM

సీనియర్‌ నటి జమున(86) ఇకలేరు. వయోధికభారంతో, అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని నివాసంలో ఆమె కన్నుమూశారు. 11గంటలకు జమున భైతికకాయాన్ని ఫిల్మ్‌చాంబర్‌కు తరలిస్తారు. జమున 1936 ఆగస్ట్‌ 30న హంపీలో జన్మించారు. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. తండ్రి వ్యాపార రీత్యా.. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె తొలిచిత్రం పుట్టిల్లు. రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్ర సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు జమున.

జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి పుట్టిల్లు (1953)లో నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాలలోకి తెరంగేట్రం చేశారామె. సత్యభామా కలాపంతో ప్రేక్షక జన హృదయాల్లో విహరించారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. తర్వాత అంచలంచలెగా ఎదిగి 198 సినిమాల్లో నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున. దక్షిణాది భాషలన్నంటితో పాటు.. పలు హిందీ సినిమాల్లోనూ నటించి భళీ అనిపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున.

తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. బంగారు పాప, వద్దంటే డబ్బు, దొంగ రాముడు, సంతోషం, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, చింతామణి, భాగ్యరేఖ, మా ఇంటి మహాలక్ష్మి, గులేబకావళి కథ, గుండమ్మ కథ, పూజాఫలం, బొబ్బిలి యుద్ధం, దొరికితే దొంగలు, కీలు బొమ్మలు, తోడు నీడ, శ్రీకృష్ణ తులాభారం, లేత మనసులు, చదరంగం చిత్రాలతో మెప్పించారు జమున. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె.

1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా, 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసంక్లిక్ చేయండి..