Mohan babu controversy: రంగంలోకి మోహన్ బాబు అభిమానులు.. నాగబాబుకు వార్నింగ్
వివాదం ముదురుతోంది. నాగశ్రీను ఎపిసోడ్ టాలీవుడ్‌లో మంటలు రేపుతోంది. తనను కులం పేరుతో మోహన్ బాబు దూషించారన్న హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను వ్యాఖ్యలతో నాయి బ్రహ్మణులు రోడ్డెక్కారు.
Manchu Vishnu Hairdresser: వివాదం ముదురుతోంది. నాగశ్రీను(Naga Srinu) ఎపిసోడ్ టాలీవుడ్‌లో మంటలు రేపుతోంది. తనను కులం పేరుతో మోహన్ బాబు దూషించారన్న హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను వ్యాఖ్యలతో నాయి బ్రహ్మణులు రోడ్డెక్కారు. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ వివాదం ఇప్పుడు చినికి చినికి గాలివానలా మారుతోంది. మోహన్ బాబు తనను కులం పేరుతో దూషించారన్నది నాగశ్రీను ఆరోపణ. మొకాళ్లపై నిలబెట్టారు, చిత్రహింసలకు గురిచేశారంటూ ఆరోపిస్తున్నాడు నాగశ్రీను. దీనిపై గుంటూరు(Guntur), ఒంగోలులో నాయి బ్రాహ్మణులు ఆందోళలు చేపట్టారు. ఇదిలా కొనసాగుతుండగానే సినీ నటుడు నాగబాబు మరో ట్విస్ట్ ఇచ్చారు. నాగశ్రీను కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. దీనికి తోడు బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మోహన్‌బాబును తప్పుబట్టారు. కులం పేరుతో దూషించడాన్ని ఖండించారు.
ఈ ఎపిసోడ్‌పై మోహన్ బాబు ఫ్యాన్స్ మండి పడుతున్నారు. వ్యక్తిగత దూషణలు, కులానికి ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. కులాలను చూసే వ్యక్తి మోహన్ బాబు కాదు, అందరిని అక్కున చేర్చుకునే మనస్తత్వం ఆయనిది అంటున్నారు అభిమానులు. వ్యక్తిగత విషయాలను కులానికి ఆపాదిస్తే సహించేది లేదన్నారు మోహన్ బాబు అభిమానులు. నాగబాబు తీరును మోహన్‌బాబు ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. మోహన్‌బాబుపై ఆరోపణలు చేసిన వ్యక్తికి సాయం చేయడంలో ఉద్దేశమేంటని ప్రశ్నిస్తున్నారు. నాగబాబు, ఆర్. కృష్ణయ్యలు మంచు కుటుంబంపై ఆరోపణలు చేస్తే అభిమానులుగా చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు.
ఎన్నో ఏళ్ల పాటు మంచు ఫ్యామిలీ దగ్గర పనిచేస్తే.. తనపై దొంగతనం కేసు పెట్టి, మానసికంగా వేధించారని ఆరోపిస్తున్నాడు నాగశ్రీను. మోహన్ బాబు తనను మోకాళ్లపై నిలబెట్టి అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.