Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కవలలు కూడా ఇలా చేయలేరేమో.. నాటు నాటు సాంగ్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల డ్యాన్స్‌పై గరికపాటి ఇంకా ఏమన్నారంటే?

ఈనెల 13న 95వ ఆస్కార్‌ అకాడమీ అవార్డులను ప్రకటించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే జక్కన్న, ఎన్టీఆర్‌, చెర్రీ తదితరులు ఇప్పటికే లాస్‌ ఏంజెలిస్‌ చేరుకున్నారు. తమ పాటను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రమోట్‌ చేస్తున్నారు.

కవలలు కూడా ఇలా చేయలేరేమో.. నాటు నాటు సాంగ్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల డ్యాన్స్‌పై గరికపాటి ఇంకా  ఏమన్నారంటే?
Garikipati Narasimha Rao
Follow us
Basha Shek

|

Updated on: Mar 09, 2023 | 12:31 PM

ప్రస్తుతం ఎక్కడ చూసినా నాటు నాటు సాంగ్‌ ఫీవర్‌ కనిపిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ఈ సూపర్‌ హిట్‌ సాంగ్‌ ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారం బరిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అవ్వడంతో ఈ పాటలో అద్భుతంగా డ్యాన్స్‌ చేసిన తారక్‌, రామ్‌చరణ్‌ పేర్లు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్నాయి. ఈనెల 13న 95వ ఆస్కార్‌ అకాడమీ అవార్డులను ప్రకటించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే జక్కన్న, ఎన్టీఆర్‌, చెర్రీ తదితరులు ఇప్పటికే లాస్‌ ఏంజెలిస్‌ చేరుకున్నారు. తమ పాటను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రమోట్‌ చేస్తున్నారు. ఇక తెలుగు వారితో పాటు భారతీయులంతా.. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కూడా ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ రావాలని బలంగా కోరుకుంటున్నారు. నాటు నాటు పాట గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. అంతేకాక ఆ పాటలో నటించిన ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లపై ఆయన చేసిన కామెంట్స్ ఇరువురి ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తుతున్నాయి.

ఆస్కార్‌ వస్తే తిరుగుండదు..

‘నాకు నిన్నటి వరకు నాటు నాటు పాట గురించి తెలీదు. అయితే ఎక్కడ చూసినా ఈ పాట గురించే చర్చించుకుంటున్నారు. దీంతో నేను మా అబ్బాయిని పిలిచి ఆ పాటేంటో పెట్టరా అని అడిగాను. దాదాపు అరగంట పాటు అలానే కూర్చొని నాటు నాటు పాట విన్నాను. ఆ పాట ఎందుకంత స్థాయికి వెళ్లిందో తెలుసుకోవాలి కదా మరి. పాట పూర్తిగా విన్న తర్వాత.. నాకు అనిపించింది ఒక్కటే. ఇది అచ్చ తెలుగు పాట.. ఎక్కడా ఒక్క ఇంగ్లిష్ పదం లేదు. నాటు అనేది కూడా తెలుగు పదమే. నాటు మాంసం, నాటు కోడి, నాటు వైద్యం ఇలా తెలుగులో ఎన్నో పదాలున్నాయి. ఇంత చక్కగా పాట రాసిన చంద్రబోస్‌కి నమస్కారం. అచ్చ తెలుగు పాటకు అద్భుతమైన ఆ నటులు చేసిన నటన, కీరవాణి సంగీతం, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ కారణంగా ఈ పాటకు ప్రపంచ స్థాయి బహుమతి రాబోతుంది. ఇందుకు మనం ఎంతో సంతోషించాలి. నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్‌ అవ్వడమే చాలా గొప్ప విషయం. ఆ భగవంతుడి దయవల్ల మార్చి 13వ తేదీన.. ఇక పురస్కారం కూడా వస్తే మనంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. నాటు నాటు పాటకు ఆస్కార్‌ పురస్కారం రావాలని కాంక్షిద్దాం. సరస్వతీ దేవిని పూజిద్దాం. గుడికి వెళ్లే వారు నాటు నాటుకు ఆస్కార్‌ రావాలని దేవుడికి దండం పెట్టండి. ఆ అవార్డు వస్తే మనమంతా గర్వంగా తిరుగుతాం’

చిన్నవాళ్లైనా నమస్కారం పెడుతున్నా..

‘ఇకఈ పాటలో ఆ ఇద్దరి నటులు (తారక్‌, చెర్రీ) నటన ఎలా ఉందంటే.. ఈయన బెల్ట్ తీస్తే ఆయనా తీశాడు, ఈయన కుడికాలు తిప్పితే ఆయనా కుడికాలే తిప్పాడు, ఇద్దరూ అలా కూడ బలుక్కుని నటించడం కవలలై పుట్టినవారికి కూడా సాధ్యం కాదు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు ఇద్దరూ అటువంటి అద్భుత నటన ప్రదర్శించారంటే.. వాళ్లు నా కంటే చిన్నవాళ్లైనా సరే.. ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాను’ అంటూ ప్రశంసలు కురిపించారు గరికపాటి. ఇక చివర్లో ‘నేను కాస్త కష్టపడితే ఈ పాట రాయగలనేమో కానీ.. వాళ్లలాగా నేను ఎగరలేను కదా అని అనిపించింది నాకు’ అంటూ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరారు గరికపాటి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో బాగా వైరల్ అవుతోంది. గొప్ప ప్రవచన కర్త అయిన గరికపాటి తనకంటే ఎంతో చిన్నవాళ్లైన తారక్‌, రామ్‌చరణ్‌లకు నమస్కారం చెప్పడం ఆయన సంస్కారానికి నిదర్శనమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..