Dulquer Salmaan: ‘అవార్డ్ వస్తే కొనుక్కున్నాను అన్నారు’.. చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సీతారామం హీరో..
దుల్కర్ సల్మాన్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అవమానాలను గుర్తుచేసుకున్నారు. ఉత్తమ నటుడిగా రాష్ట్రం ఇచ్చిన అవార్డును తాను డబ్బులు ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేశానని కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చారు.
మహానటి సినిమాలో జెమిని గణేషన్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). మొదటి సినిమాతోనే నటనకు ప్రశంసలు అందుకున్న ఈ హీరో..ఇప్పుడు మరోసారి సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు. లెఫ్టినెంట్ రామ్.. ఓ ఒంటరి ఆర్మీ ఆఫీసర్‌గా ప్రేక్షకుల హృదయాలను తాకారు. డైరెక్టర్ హాను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పా్న్స్ వచ్చింది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌కు పరిచయమైంది. విడుదలై 50 రోజులు పూర్తైనప్పటికీ థియేటర్లలో సీతారామం సందడి మాత్రం తగ్గడం లేదు. ఇక ఈ సినిమానే కాకుండా దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన మరో మూవీ చుప్. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న దుల్కర్ సల్మాన్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అవమానాలను గుర్తుచేసుకున్నారు. ఉత్తమ నటుడిగా రాష్ట్రం ఇచ్చిన అవార్డును తాను డబ్బులు ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేశానని కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చారు.
మలయాళ అడ్వెంచర్ డ్రామా చార్లీ సినిమాకు గానూ 2016లో మొదటి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు గెలుచుకున్నాడు దుల్కర్ సల్మాన్. అయితే ఆ అవార్డు తాను డబ్బులిచ్చి కొన్నాడని ట్రోల్ చేశారని.. ఆ వార్తలు తనను తీవ్రంగా బాధించాయని తెలిపారు. “మీ అవార్డును అమ్మాలనుకుంటున్నారా ? మీరు చెల్లించిన దానికంటే రూ. 500 ఎక్కువ ఇస్తాను” అంటూ ఓ వ్యక్తి తనను ట్రోల్ చేశారని.. ఆ కామెంట్స్ తనను కుంగదీశాయని.. కానీ ధైర్యంగా అతడిని తిరిగి సమాధానం చెప్పినట్లు తెలిపారు. తాను అవార్డ్ కొనాల్సి వస్తే చాలా కాలం క్రితమే ఆ పని చేసేవాడినంటూ చెప్పుకొచ్చారు. అవార్డులు రావడమనేది మనం చేస్తున్న పనికి.. చేయబోయే పనులకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వడం మాత్రమే. వాటిని ఎప్పుడూ ఆనందించాలి. ఎలాంటి ఆలోచనలు రాకూడదు అని నా స్నేహితుడు చెప్పడంతో నేను బాధపడలేదు అని అన్నారు.
అంతేకాకుండా.. తాను సినిమాలు మానేయాలని.. ఇండస్ట్రీకి నేను పనికిరానని.. నా సినిమాలకు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేవారని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.