SSMB 29: ఆంధ్ర ఒడిశా బోర్డర్‌లో జక్కన్న.. గిరిజన యువతతో కలిసి వాలీబాల్ ఆడిన రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు చివరిగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. దాంతో మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో డైరెక్టర్ రాజమౌళి సందడి చేస్తున్నాడు. స్థానిక గిరిజన యువతతో సరదా సరదాగా గడుపుతూ ఆడిపాడుతున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళిని చూడటమే కష్టం అనుకుంటే నేరుగా తమ వద్దకే రావడంతో స్థానిక గిరిజనుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చూస్తే చాలు అనుకున్న గిరిజనులు తమ వద్దకు వచ్చి తమతో సరదాగా గడపడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్ లోని గిరిజన గ్రామాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా తోలోమాలి, దేవ్ మలై వంటి పర్యాటక ప్రదేశాల్లో గత కొద్ది రోజులుగా రాజమౌళి మహేష్ బాబుతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ జరుపుతున్నారు.
ఈ షూటింగ్ లో మహేష్ బాబుతో పాటు పలువురు తెలుగు నటులతో పాటు బాలీవుడ్ నటులు పాల్గొంటున్నారు. మూవీ టీమ్ ఉండేందుకు ప్రత్యేక గుడారాలు వేసుకొని అన్నిరకాల మౌలిక సదుపాయాలు అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు రాజమౌళి, మహేష్ బాబుతో పాటు మూవీ టీమ్ అంతా బిజీబిజీగా గడుపుతున్నారు. సాయంత్రానికి షూటింగ్ పూర్తయిన తర్వాత రాజమౌళి టీం ఏజెన్సీ ప్రాంతంలోని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం స్థానిక గిరిజన యువతతో వారి గ్రామాలకు వెళ్లి సమావేశం అవుతున్నారు. వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. యువత ఎంతవరకు చదువుకున్నారు? వారి లక్ష్యం ఏంటి? అనే అంశాల పై చర్చించారు. వారికి మోటివేషనల్ క్లాస్ ఇస్తున్నారు. తన ఎదుగుదలకు ఎంత కష్టపడ్డాల్సి వచ్చిందో.? కష్టపడితే జీవితంలో ఎలా ఉన్నత శిఖరాలకు వెళ్లగలరో చెప్పాడు.
స్థానికంగా చిరు ఉద్యోగాలు చేస్తున్న గిరిజనులతో మాట్లాడి, వారి జీవన ప్రమాణాల పై ఆరా తీశాడు. వారు మరింతగా ఎదగడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు వివరించాడు. అనంతరం గిరిజన యువకులతో వాలీబాల్ తో పాటు ఇతర ఆటలు ఆడి వారిని సంతోష పరిచారు. దీంతో స్థానిక గిరిజనులు పాన్ ఇండియా డైరెక్టర్ అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటున్నారని, తమకు జీవితంలో ఉపయోగపడే చాలా మంచి మాటలు చెప్పారని, రాజమౌళితో కొన్ని గంటలపాటు గడపటం ఆనందంగా ఉందని చెప్తున్నారు. అనంతరం స్థానిక జర్నలిస్టులతో కొంత సేపు ముచ్చటించారు. కొందరు జర్నలిస్టులు తమకు సినిమాల్లో నటించే ఛాన్స్ ఇవ్వాలని కోరారు. అందుకు సుముఖత వ్యక్తం చేసిన రాజమౌళి త్వరలో పిలుస్తామని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..