Uunchai Movie Review: స్నేహంతో కలిసి ప్రయాణించే అద్భుతమైన కథ
ఇప్పుడు ఇదే స్నేహం కాన్సెప్ట్ పై దర్శకుడు సూరజ్ బర్జాత్య తెరకెక్కించిన చిత్రం ‘ఉంచాయి’. ఇందులో అమితాబ్ బచ్చన్, డానీ డెంజొప్పా, అనుపమ్ ఖేర్ , బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషించారు.
బాలీవుడ్‌లో స్నేహం నేపథ్యంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దిల్ చాహ్తా హై, జిందగీ నా మిలేగీ దొబారా వంటి సినిమాలు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి. ఇప్పుడు ఇదే స్నేహం కాన్సెప్ట్ పై దర్శకుడు సూరజ్ బర్జాత్య తెరకెక్కించిన చిత్రం ‘ఉంచాయి’. ఇందులో అమితాబ్ బచ్చన్, డానీ డెంజొప్పా, అనుపమ్ ఖేర్ , బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషించారు.
కథ:
అమిత్ శ్రీవాస్తవ (అమితాబ్ బచ్చన్), భూపేన్ (డానీ), ఓం (అనుపమ్ ఖేర్) , జావేద్ (బోమన్ ఇరానీ) నలుగురు స్నేహితులు ఢిల్లీలో నివసిస్తున్నారు. వారి బిజీ షెడ్యూల్‌ల నుండి సమయాన్ని వెచ్చిస్తూ, ఈ స్నేహితులు ఎల్లప్పుడూ ఒకరి పుట్టినరోజులను మరొకరు కలిసి జరుపుకుంటారు. ఓం పుస్తక దుకాణాన్నినడుపుతూ ఉంటాడు. అమిత్ రచయిత. జావేద్‌కు బట్టల వ్యాపారం ఉండగా, భూపేన్ క్లబ్‌ను నడుపుతూ.. చెఫ్‌గా పనిచేస్తుంటాడు.
తన స్నేహితులను ఒక్కసారైనా నేపాల్ పర్వతాలలో ఉన్న తన స్వదేశానికి తీసుకెళ్లాలనేది భూపేన్ కల. కానీ ఎప్పుడూ ఇదొక కారణం వాళ్లకు అడ్డు తగులుతుంది. తన పుట్టిన రోజునే భూపేన్ మరోసారి హిమాలయన్ బేస్ క్యాంప్‌కు వెళ్లడం గురించి తన స్నేహితులకు చెప్తాడు. అయితే మరుసటి రోజు గుండెపోటుతో అతడు మరణిస్తాడు. భూపేన్ కలను నెరవేర్చడానికి, ముగ్గురు స్నేహితులు అతని అవశేషాలను ఎవరెస్ట్ శిఖరంపై పాతిపెట్టాలని నిర్ణయించుకుంటారు.
దాంతో అసలు కథ మొదలవుతుంది. ఈ ప్రయాణంలో మాల (సారిక)ని కలుస్తారు. వీరి ప్రయాణం ఎలా సాగింది. ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ: చాలా కాలం తర్వాత సూరజ్ బర్జాత్యా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. రాజశ్రీ ప్రొడక్షన్స్‌లో ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు ఈ డైరెక్టర్. అతని విలక్షణమైన శైలి ప్రేక్షకులకు బాగా తెలుసు. అయితే ఆయన డైరెక్షన్‌లోని భిన్నమైన కోణాన్ని ‘ఉంచాయ్’ ద్వారా చూడొచ్చు. ఇందులో ముఖ్యంగా రాజశ్రీ ప్రొడక్షన్ అంచనాలను పక్కనపెట్టి విభిన్నంగా దర్శకత్వం వహించే ప్రయత్నం చేశాడు.
ఈ చిత్రంలో, నాల్గవ స్నేహితుడి కలను నెరవేర్చే ముగ్గురు స్నేహితుల ప్రయాణాన్ని ప్రేక్షకులు చూడటమే కాదు, ఆ పాత్రలతో కలిసి ప్రయాణం చేస్తారు. ఢిల్లీ నుంచి గోరఖ్‌పూర్ వరకు ప్రయాణం ఇంటర్వెల్ వరకు చూపించారు. ఇంటర్వెల్ తర్వాత, ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ప్రయాణం చూపించారు.
ఈ మొత్తం ప్రయాణంలో ఏ క్షణాన్నీ కారణం లేకుండా చూపించారనే భావన లేదు. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను తమ సీట్ల అంచున ఉంచుతుంది. వారి స్నేహం కొన్నిసార్లు ముఖంలో చిరునవ్వును , కొన్నిసార్లు కళ్లలో కన్నీళ్లను తెప్పిస్తాయి. బాంధవ్యాల ప్రాముఖ్యత, స్నేహ వేడుకలు, ప్రయాణం ఇలా ఎన్నో విషయాల గురించి మంచి పాఠం చెప్పే ప్రయత్నం ఈ సినిమా. సినిమా నిడివి ఎక్కువే అయినా కథనం మాత్రం బోరింగ్ అనిపించదు. బలమైన స్క్రీన్‌ప్లే , నటీనటుల నటన కథలో కలిసిపోయాయి. పాటలు కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి.
చివరిగా.. ఓ అందమైన ప్రయాణం