Ghattamaneni Krishna: రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిన కృష్ణ.. అప్పట్లో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా
సినిమా రంగంలోనే కాదు..రాజకీయాల్లో కూడా కృష్ణ సూపర్ స్టారే.. అనుకున్నది చేసే వరకు వెనక్కి తగ్గని నైజం ఆయనది.. ఎందులో కాలు పెట్టినా విజయతీరాన్ని చేరేవరకు అలసిపోని సాహసం కృష్ణది..ఎంత పెద్దవాళ్లతో విభేదాలు వచ్చినా..ఒక్కసారి దిగితే..వెనక్కి తిరిగి చూసేవారు కాదు కృష్ణ..అందుకే ఆయన రాజకీయ తెరపైనా చెరగని ముద్ర వేశారు..
సూపర్ స్టార్ కృష్ణ అంటే సూపర్ స్టారే..అది సిల్వర్ స్క్రీన్ అయినా.. పొలిటికల్ స్క్రీన్ అయినా. సినిమాల్లో టాప్ హీరోగా కొనసాగుతూనే.. రాజకీయ రంగంలోనూ అడుగు పెట్టారు. అక్కడా తనదైన ముద్ర వేశారు. 1972లో జైఆంధ్ర ఉద్యమానికి కృష్ణ మద్దతిచ్చారు. ఆ తర్వాత 1982 డిసెంబరు 17న విడుదలైన కృష్ణ రాజకీయ చిత్రం ఈనాడు సినిమా అప్పుడే రంగప్రవేశం చేసిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ప్రచారానికి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది.. ఎన్నికలు మూడువారాల్లో ఉన్నాయనగా.. విడుదలైన ఈ సినిమా తెలుగుదేశం ప్రభంజనానికి తనవంతు కృషిని అందించినట్లయ్యింది.
అయితే ఆ తర్వాత రామారావు, కృష్ణ మధ్య రాజకీయ విభేదాలొచ్చాయి.. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ళ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన విడుదల కావడం.. ఈ సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలు తీసుకొచ్చింది. ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ విభేదాలు రాజుకున్నాయి. ఇక, 1984 అక్టోబరులో ఇందిరా గాంధీ దారుణహత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లారు.. ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీని కలిశారు.. ఇదే సమయంలో.. రామారావు మాస్ అప్పీల్ తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతోంది.. అలాంటి ప్రజాకర్షణ ఉన్న కృష్ణ కాంగ్రెస్ పార్టీకి ఉపకరిస్తాడని కాంగ్రెస్ నాయకులు భావించారు. ఆయన్ను పార్టీలో చేరాలని ప్రోత్సహించారు. అలా 1984లో కృష్ణ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆ తర్వాత తెలుగునాట..ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు చేశారు..ఆ క్రమంలో వచ్చినవే మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి ఇంకా ఇతర సినిమాలు.. కృష్ణ 80వ దశకంలో పలు రాజకీయ నేపథ్యంలోని సినిమాలు చేయడం వెనుక ఉన్నదీ ఇదే కారణం. నా పిలుపే ప్రభంజనం సినిమా పూర్తిస్థాయి విమర్శగా తీశారు..సినిమాలో ప్రతినాయకపాత్ర అయిన కోదండరామయ్య త్రిలింగ దీవి అన్న రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటాడు..ముక్కుసూటిగా ఉండే పెద్ద అల్లుడు, జిత్తులమారి చిన్న అల్లుళ్ల సలహాలతో కోదండరామయ్య ఇష్టారాజ్యంగా పరిపాలిస్తూంటాడు..ఈ సినిమాలో కృష్ణ డీసీపీ పాత్ర పోషించారు. రాజకీయంగా తిరుగుబాటు రావడం సినిమాలో క్లైమాక్స్. కోదండరామయ్య పాత్ర రామారావును, పెద్ద అల్లుడి పాత్ర రామారావు పెద్ద అల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చిన్న అల్లుడి పాత్ర చంద్రబాబులను పోలివుంటుంది. రామారావు ప్రభుత్వ చర్యలను సినిమా వ్యంగ్యంగా విమర్శించింది..ఈ సినిమాపై అప్పట్లో ఎన్నో చర్చలు జరిగాయి..
1989లో ఏలూరు ఎంపీగా గెలుపు
1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది.. ఆ ఎన్నికల్లో కృష్ణ ఓడిపోయారు. ఆ తర్వాత.. తనకు సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యతో పాటు.. తాను కోరిన గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందడం..ఏలూరులో ఓటమి తదితర కారణాలతో..కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడం విరమించుకున్నారు. అయినా..2009లో ఎన్నికల్లో వైఎస్ కోరిక మేరకు కృష్ణ కుటుంబం కాంగ్రెస్‌కు నైతిక మద్దతు తెలిపింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ టీడీపీలో ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..