Manchu Vishnu: ‘MAA’ లో కొనసాగుతున్న చిటపటలు.. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేయబోతున్నారు?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA)లో ఎన్నికల తర్వాత కూడా చిటపటలు కొనసాగుతున్నాయి. ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌లో గెలిచిన 11 మంది తమ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేయడం తెలిసిందే.

Manchu Vishnu: ‘MAA’ లో కొనసాగుతున్న చిటపటలు.. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేయబోతున్నారు?
Manchu Vishnu

MAA – Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA)లో ఎన్నికల తర్వాత కూడా చిటపటలు కొనసాగుతున్నాయి. ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌లో గెలిచిన 11 మంది తమ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేయడం తెలిసిందే. మా సంక్షేమం పాట పాడేసి.. నిరసన పల్లవులందుకుని మూకుమ్మడి రాజీనామాలు చేశారు. మరి.. మా అధ్యక్షుడు విష్ణు ఏం చేయబోతున్నారు? అందర్నీ మెప్పించి ఒప్పించబోతున్నారా? యస్‌.. అదే పనిలో ఉన్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన అభ్యర్థుల రాజీనామాలను ఆమోదించేది లేదని విష్ణు తీర్మానించుకున్నారు. వాళ్లతో కలిసి పని చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. అంతేకాదూ రాజీనామాలు చేసిన అభ్యర్థులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. 16న జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి గెలిచిన 26మంది సభ్యులు హాజరయ్యేలా చూడాలనేది విష్ణు ప్రయత్నంగా కనిపిస్తోంది.

వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్న విష్ణు.. ఈ గ్యాప్‌లో తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగానే అత్యంత ముఖ్యమైన మా సభ్యుల పెన్షన్స్ ఫైల్ పై తొలి సంతకం చేశారు. మా అధ్యక్ష ప్రయాణంలో ఎవరి ప్రభావం తనపై పడకుండా విష్ణు జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా షాడో ప్రెసిడెంట్‌గా పిలవబడుతున్న నరేష్‌ను పూర్తిగా సైడ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి మా ఎన్నికల ఎపిసోడ్‌లో కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలిచింది నరేషే. నాన్‌లోకల్‌, నాన్‌ తెలుగు, గెస్ట్‌ లాంటి పదాలతో ప్రత్యర్థి ప్యానల్‌ను టార్గెట్ చేశారు. విష్ణు రథం ఎక్కిన కృష్ణుడినని చెప్పుకుంటూ శకుని పాత్ర పోషించాడనే విమర్శలు ఉన్నాయి.

ఏది ఏమైనా  మా ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు నరేష్ మాకు మాజీ అధ్యక్షుడు మాత్రమే. అయినా ఆయన ఎంట్రీ ఎంటన్నది ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌ వాదన. అయితే ఇకపై నరేష్‌ రోల్‌గాని ఇన్‌ఫ్లూయెన్స్‌ గానీ విష్ణుపై ఉండబోదని ఆయన వర్గీయులు అంటున్నారు. అదే నిజమైతే 90శాతం సమస్యలు తీరినట్టేనని ఇండస్ట్రీకి చెందిన మెజార్టీ మెంబర్లు అంటున్నారు.

నరేష్‌ పాత్రను సైడ్ చేస్తే.. నిన్న ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌ అంతా మోహన్‌ బాబు టార్గెట్‌గా విమర్శలు చేసింది. పోలింగ్ సమయంలో బూతులు, బెదిరింపులు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి విష్ణుని ఎన్నికల్లో గెలిపించేందుకు మోహన్‌ బాబు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఆ దిశగా సక్సెస్‌ అయ్యారు కూడా. మరిప్పుడు ఆయన పాత్ర ఏంటి? తండ్రి పాత్ర లేకుండా తనదైన స్టయిల్‌లో బాధ్యతలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు విష్ణు. స్వతంత్రంగా పనిచేయబోతున్నారట. తన ఆలోచనలతో అందరు సభ్యులతో కలిసి పనిచేసేందుకు మంచు విష్ణు సరికొత్తగా రెడీ అవుతున్నారట.

మా ఎన్నికల్లో జరిగిన గొడవలు.. నిరసనగా ప్రకాష్‌ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన అభ్యర్థుల రాజీనామాల నడుమ మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. వచ్చిరాగానే పెన్షన్‌ ఫైలుపై సంతకం చేశారు. మేనిఫెస్టో అమలుపై ఎంత చిత్తశుద్ది ఉందో చెప్పకనే చెప్పారు విష్ణు. ఫైనల్‌గా మా ఐక్యత ఆయన ముందున్న లక్ష్యం. మరి ఆ టార్గెట్‌ను చేరుకునేందుకు ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఇండస్ట్రీ ఆసక్తిగా గమనిస్తోంది.

Also Read..

AP Govt.Funds Scam: తెలంగాణలో తీగ లాగితే.. ఏపీలో డొంక కదులుతోంది.. తెలుగు అకాడమీ తరహాలో ఏపీలోనూ మోసం!

Bigg Boss 5 Telugu: సారీ చెప్పను.. ఏం చేసుకుంటావో చేసుకో.. పవన్‌ కళ్యాణ్‌ స్టైల్లో సిరికి కౌంటర్‌ ఇచ్చిన సన్నీ..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu