Ajith Kumar: షాకింగ్.. స్టార్ హీరో షేక్ హ్యాండ్ ఇస్తే బ్లేడ్‌తో కోసేసిన అభిమాని.. ఏం జరిగిందంటే?
ఓ వైపు సినిమాలు, మరోవైపు కారు రేసింగులతో రయ్ రయ్ మంటూ దూసుకపోతున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాల్లో నటించాడీ సీనియర్ హీరో. అలాగే పలు కార్ రేసింగ్ ఈవెంట్స్ లోనూ సత్తా చాటాడు.

ఇతర స్టార్ హీరోలతో పోల్చితే అభిమానుల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాడు కోలీవుడ్ సీనియర్ హీరో అజిత్ కుమార్. అభిమానం పేరిట ఫ్యాన్స్ చేసే పిచ్చి పనులను అసలు సహించడు. అందుకే తన పేరిట ఉన్న అన్ని అభిమాన సంఘాలను సైతం రద్దు చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అజిత్ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. అభిమాని చేతిలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని అందరితో పంచుకున్నాడు. ‘ అభిమానులు నా కారును ఆపి ఫొటోలు, సెల్ఫీల కోసం కారు కిటికీ అద్దాలు దించమని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. వచ్చిన వ్యక్తి నిజంగా అభిమానా లేక హాని తలపెట్టే వ్యక్తా అని మనకు ఎలా తెలుస్తుంది? ఒకసారి ఒక వ్యక్తి నన్ను పలకరిస్తూనే నా అరచేతిని బ్లేడుతో కోసేశాడు. ఇప్పటికీ నా చేతులపై ఆ మచ్చలు ఉన్నాయి. ఇది 2005లో జరిగింది. చాలా మంది తమ చేతులను ముందుకు చాచారు. నేను వారికి షేక్ హ్యాండ్ ఇచ్చేసి కారులోకి ఎక్కాను. అప్పుడు నాకు రక్తం కారుతుంది. ఒక అవుట్‌డోర్ షూటింగ్ సమయంలో ఇది జరిగింది.’
‘ఒక సినిమా షూటింగ్ కోసం మేం హోటల్ లో ఉన్నాం. అక్కడ రోజూ చాలా మంది జనం వచ్చేవారు. ఒక రోజు హోటల్ యజమాని నా దగ్గరకు వచ్చి ..’ జనాన్ని అదుపు చేయడం మాకు కష్టంగా ఉంది. మీరు వారికి చేయి ఊపి, కొన్ని ఫొటోలు దిగగలరా?’ అని రిక్వెస్ట్ చేశాడు. అలా ఒకరోజు నన్ను కలిసేందుకు చాలా మంది వచ్చారు. నాతో షేక్ హ్యాండ్ కోసం తమ చేతులను ముందుకు చాచారు. నేను అసలు విషయం తెలుసుకునేలోపే అంతా జరిగిపోయింది. సెక్యూరిటీ సిబ్బంది 18 లేదా 19 ఏళ్ల అబ్బాయిని పట్టుకున్నారు. అతను ఒక బ్లేడ్‌ను సగానికి విరిచి తన చేతుల మధ్య పట్టుకున్నాడు. ఆ అబ్బాయి స్పృహలో లేడు. అతను మద్యం సేవించాడో లేక మరేదైనా జరిగిందో మాకు తెలియదు. కానీ అతను ఉన్మాద స్థితిలో ఉన్నాడని అర్థమైంది’ అని అజిత్ అప్పటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







