Superstar Krishna: అన్నయ్య లేకపోవడంతో అంతా చీకటిమయం అయ్యింది.. ఎమోషనల్ అయిన కృష్ణ సోదరుడు
ఈ నెల 15న సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. నటశేఖరుడి మరణంతో మహేష్ కుటుంబంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని ముద్ర వేసిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. సాహసానికి మరోపేరు కృష్ణ. దాదాపు 350సినిమాలకు పైగా నటించి మెప్పించారు. ఈ నెల 15న సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. నటశేఖరుడి మరణంతో మహేష్ కుటుంబంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఈ నెల14న అర్ధరాత్రి సమయంలో కృష్ణకు గుండెపోటు రావడంతో ఆయనను కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందిన కృష్ణ ఈ నెల 15న తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. కృష్ణ చిన్న కుమారుడు మహేష్ తండ్రికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. కృష్ణ మరణంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు. ఈ ఏడాది అన్న, అమ్మ , నాన్న ఇలా ఒకరి తరవాత ఒకరిని కోల్పోయారు మహేష్.
కృష్ణ మరణం తర్వాత ఆయన సోదరుడు ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. అన్నయ్య చనిపోయిన తర్వాత అంతా శూన్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నయ్యతో నాకు 70 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన లేకపోవడంతో ఒక్కసారిగా శూన్యమైపోయింది. ఆయన స్మారక మందిరాన్ని నిర్మించాలనే ఒక ఆలోచన ఉంది అన్నారు. ఆయన చిన్నతనం గుర్తు చేసుకుంటూ.. నా చిన్నప్పుడు సైకిల్ పై మా అన్నయ్య సినిమాలకి తీసుకుని వెళ్లడం నాకు ఇంకా గుర్తుంది అంటూ ఎమోషనల్ అయ్యారు. నేను చెన్నై లో ఆయన దగ్గరే ఉంటూ చదువుకునేవాడిని అని తెలిపారు.
సినిమాల లెక్కలకి సంబంధించిన విషయాల్లో అన్నయ్యకి మంచి అవగాహన ఉండేది. ఏ సినిమా ఎందుకు ఆడింది? .. ఎందుకు ఆడలేదు? ఎందుకు ఓపెనింగ్స్ పెరిగాయి? ఎందుకు తగ్గాయి? ఇలా ప్రతి విషయంలో ఆయనకంటూ అంచనాలు ఉండేవి. అల్లూరి సీతారామరాజు సినిమా రిలీజ్ అయ్యేవరకూ అన్నయ్య రోజుకు మూడు షిఫ్టులు పనిచేస్తూ వచ్చారు. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను ఒకే కెమెరాతో ఒకే లెన్స్ తో చిత్రీకరించారు. అయినా ఇప్పటికీ ఆ సినిమాకి వంకబెట్టలేం అని చెప్పుకొచ్చారు.