Actor Ponnambalam: ‘సొంత తమ్ముడే నన్ను చంపాలని చూశాడు’.. నటుడు పొన్నంబలం ఆవేదన..
ఒకప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్న పొన్నంబలం ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
80,90లో తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడిగా ఓ వెలుగు వెలిగిన నటుడు పొన్నంబలం. ఇండస్ట్రీలోకి స్టంట్ మ్యాన్‌గా అడుగుపెట్టి.. ఆ తర్వాత పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన.. ఆ తర్వాత పలు చిత్రాల్లో మెప్పించారు. ఒకప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్న పొన్నంబలం ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే గతేడాది ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. సర్జరీ అనంతరం కోలుకున్న పొన్నంబలం ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఓ తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలు.. నమ్మినవారే తనను మోసం చేయడం గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు. సొంతవాళ్లే తనను చంపాలని చూశారని… అందకు తనకు స్లో పాయిజన్ ఇచ్చారని అన్నారు.
పొన్నంబలం మాట్లాడుతూ.. “నేను అతిగా తాగడం వల్లే నా కిడ్నీలు పాడయ్యాయని అందరు అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. నా తమ్ముడే నాకు స్లో పాయిజన్ ఇచ్చి నన్ను చంపాలని చూశాడు. మా నాన్నకు నలుగురు భార్యలు. మూడు భార్య కొడుకు నాకు మేనేజర్ గా పనిచేసేవాడు. నా ఎదుగుదులను తట్టుకోలేక నా ఆహారంలో.. తీసుకునే డ్రింక్స్ లో స్లో పాయిజన్ కలిపాడు. ఆ విషయాన్ని వైద్యులు గుర్తించారు. అది తెలియక నేను వాడిని చాలా నమ్మాను. నేను వాడి బాగు కోరుకుని ఉద్యోగం ఇస్తే.. నా ఎదుగుదల చూసి ఓర్వలేక నన్ను చంపాలని చూశాడు. అంతేకాదు నా మీద చేతబడి చేయించాడు. ఇటీవలే నాకు ఆ విషయం తెలిసింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.