Balakrishna: మోక్షజ్ఞకు ఆ థియేటర్‌కు విడదీయరాని సంబంధం.. తారకరామ థియేటర్ రిఓపెనింగ్లో బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్..
ఈ నెల 16 నుంచి అవతార్ 2 చిత్రంతో ఏషియన్ తారకరామలో ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. ఈ తారకరామ థియేటర్ తమ కుటుంబానికి దైవంతో సమానమన్నారు బాలకృష్ణ.
కాచిగూడలోని తారకరామ థియేటర్‌ను పునః ప్రారంభించారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఏషియన్ గ్రూపుతో కలిసి తారకరామ థియేటర్‌ను కొత్త హంగులతో ముస్తాబు చేసింది నందమూరి కుటుంబం. 590 సీట్ల సామర్థ్యంతో 4K ప్రొజెక్షన్‌తో థియేటర్ పునఃనిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ శిరీష్, బాలయ్య ఫ్యామిలీ, తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16 నుంచి అవతార్ 2 చిత్రంతో ఏషియన్ తారకరామలో ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. ఈ తారకరామ థియేటర్ తమ కుటుంబానికి దైవంతో సమానమన్నారు బాలకృష్ణ. ఈ థియేటర్‌లోనే ఎన్టీఆర్.. మోక్షజ్ఞకు పేరు పెట్టారని.. మూడోసారి తారకరామ థియేటర్ ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఈ తారకరామ థియేటర్ కు ఓ చరిత్ర ఉంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మా తల్లి జ్ఞాపకార్థం కట్టాం. అది మాకొక దేవాలయం. అదే విధంగా ఈ థియేటర్ కూడా మాకు దేవాలయంతో సమానం. అమ్మానాన్నల పేర్లు కలిసి వచ్చేలా ఈ థియేటర్ అర్పాటు చేశారు. 1978లో దీన్ని ప్రారంభించాం. అక్బర్ సలీం అనార్కలీతో ఇది మొదలైంది. అనివార్య కారణాల వల్ల నిలిచిపోయిన ఈ థియేటర్ ను తిరిగి 1995 లో పునఃప్రారంభించాం. నేటి టెక్నాలజీకి అనుగుణంగా అధునాతన హంగులతో ఇప్పుడు మూడోసారి అందుబాటులోకి తీసుకువచ్చాం.
డాన్ సినిమా ఇక్కడ 525 రోజులు ఆడింది. నా సినిమాలు కూడా ఇక్కడ ఘన విజయాన్ని అందుకున్నాయి. అలాగే నాకు సెంటిమెంట్ కూడా ఉంది. ఎందుకంటే మా అబ్బాయి తారకరామ తేజ నామకరణాన్ని నాన్న ఈ థియేటర్లోనే చేశారు. ఏషియన్ సినిమాస్ సంస్థతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్లతో కలిసి ఈ ఏషియన్ తారకరామ ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడం అనందంగా ఉంది. సినీ పరిశ్రమకు మరింత అభివృద్ది చెందాలి ” అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.