AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K Viswanath: కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు.. ‘శంకరభరణం’ విడుదల రోజునే తుదిశ్వాస విడిచిన టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్(92) ఇకలేరు. గురువారం రాత్రి ఆయన

శివలీల గోపి తుల్వా
| Edited By: |

Updated on: Feb 03, 2023 | 7:16 AM

Share

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్(92) ఇకలేరు. గురువారం రాత్రి(ఫిబ్రవరి 2) ఆయన తన తుదిశ్వాస విడిచారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన, తెలుగు చలనచిత్ర ఆణిముత్యాల్లో ఒకటైన ‘శంకరాభరణం(1980)’ విడుదలైన రోజు(ఫిబ్రవరి 2)నే ఆయన శివైక్యం చెందారు. గత కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఆయన.. హెల్త్ ఇష్యూస్ తీవ్రతరం కావడంతో గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి చేరారు. ఆ క్రమంలోనే చికిత్స పొందుతూ గురువారం రాత్రి మనను విడిచి వెళ్లిపోయారు. ఆయన తుదిశ్వాస విడిచిన వార్త తెలిసి పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలలోని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అయితే భారతీయ సినీపరిశ్రమలో టాలీవుడ్ పేరు వినబడేలా చేసిన దర్శకుల్లో కె విశ్వనాథ్ ప్రముఖులు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకొని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి.. కళాతపస్వి అనిపించుకున్నారు దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్.

సినీ ప్రస్థానం

కళాతపస్వి విశ్వానాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. 1930 ఫిబ్రవరి 19న జన్మించిన ఆయన.. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్‌ కంప్లీట్‌ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత వాహిని స్టూడియోస్‌లో సౌండ్‌ ఆర్టిస్టుగా తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. 1965లో అక్కినేని నాగేశ్వరావు కథానాయకుడిగా నటించిన ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా వచ్చిన కె.విశ్వనాథ్‌ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్‌ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన సత్తాచాటారు విశ్వనాథ్. శుభసంకల్పం సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కె.విశ్వనాథ్‌.. వజ్రం, కలిసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వులేకనీను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్‌ వంటి పలు సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు.

తొలి సినిమాతోనే ‘నంది’

‘ఆత్మ గౌరవం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విశ్వనాథ్.. ఆ మూవికి నంది పురస్కారాల్లో ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య బహుమతి లభించింది. సినిమా కథకు కూడా నంది పురస్కారం లభించింది. ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘చెల్లెలి కాపురం’, ‘శారదా’, ‘ఓ సీత కథ’,‘జీవన జ్యోతి’ చిత్రాలకు కూడా ఉత్తమ సినిమా విభాగంలో నంది అవార్డులు అందుకున్నాయి. ఈ అవార్డులను అందుకున్న విశ్వనాథ్ సినిమాలు ఇంకెన్నో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

‘శంకరాభరణం’తో జాతీయ పురస్కారం

విశ్వనాథ్ దర్శకత్వం వహించిన అద్భుతమైన సినిమాల్లో, భారతీయ చలనచిత్ర ఆణిముత్యాల్లో ‘శంకరాభరణం’ కూడా ఒకటి. ఈ సినిమాకు ఉత్తమ సినిమాగా నంది అవార్డు రావడమే కాక.. జాతీయ అవార్డు కూడా అభించింది. ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ ప్రోవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్’ విభాగంలో నేషనల్ అవార్డు అందుకుంది శంకరాభరణం. ‘సప్తపది’, ‘స్వాతిముత్యం’, ‘సూత్రధారులు’, ‘స్వరాభిషేకం’ సినిమాలకు కూడా నేషనల్ అవార్డులు అందుకున్నారు విశ్వనాథ్. ‘స్వాతి ముత్యం’ సినిమా అయితే ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 59వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా పంపించారు.

ఇంకెన్నో అవార్డులు

చిత్రసీమకు విశ్వనాథ్ చేసిన సేవలకు గాను ఆయనను భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. అదే సంవత్సరంలోనే రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు ఆయన. అందుకే ‘విశ్వనాథ్ అనేది తెలుగు చిత్రసీమలో ఒక పేరు కాదు, చరిత్ర’ అని అంటుంటారు సినీ ప్రముఖులు. ఇక ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 1992 లో న్నాడు.  పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నాడు. అంతేకాక గల్ఫ్ ఆంధ్రా అవార్డు ఫర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ఇన్ సినిమా(యూఏఈ) అవార్డును కుడా 2014లో అందుకున్నారు ఆయన. ఇంకా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను కూడా అందుకున్నారు విశ్వనాథ్. తెలుగు సినీ పరిశ్రమకు ఇంతగా సేవ చేసిన ఆయన నిన్న రాత్రి మరణించడంతో పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.