2019 రివైండ్: దివికేగిన టాలీవుడ్ తారలు
సినిమాల గురించి పక్కనపెడితే.. ఈ ఏడాది టాలీవుడ్‌కు చెందిన పలువురు ఈ లోకాన్ని విడిచారు. అందులో సీనియర్లే ఎక్కువగా ఉన్నప్పటికీ వారి మరణం టాలీవుడ్‌కు తీరని లోటుగా మారింది. ఇక క్యాన్సర్ బారిన పడిన కమెడియన్ వేణు మాధవ్ కూడా హఠాన్మరణం చెందడం టాప్ హీరోలను సైతం కదిలించింది. ఇక ఈ సంవత్సరం టాలీవుడ్ నుంచి మనల్ని విడిచి వెళ్లిపోయిన వారు ఎవరెవరంటే విజయ బాపినీడు: ప్రముఖ దర్శకనిర్మాత విజయ బాపినీడు ఈ ఏడాది పరమదించారు. కొన్నేళ్లుగా […]
సినిమాల గురించి పక్కనపెడితే.. ఈ ఏడాది టాలీవుడ్‌కు చెందిన పలువురు ఈ లోకాన్ని విడిచారు. అందులో సీనియర్లే ఎక్కువగా ఉన్నప్పటికీ వారి మరణం టాలీవుడ్‌కు తీరని లోటుగా మారింది. ఇక క్యాన్సర్ బారిన పడిన కమెడియన్ వేణు మాధవ్ కూడా హఠాన్మరణం చెందడం టాప్ హీరోలను సైతం కదిలించింది. ఇక ఈ సంవత్సరం టాలీవుడ్ నుంచి మనల్ని విడిచి వెళ్లిపోయిన వారు ఎవరెవరంటే
విజయ బాపినీడు: ప్రముఖ దర్శకనిర్మాత విజయ బాపినీడు ఈ ఏడాది పరమదించారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఫిబ్రవరి 12న తుది శ్వాస విడిచారు. మెగాస్టార్‌తో మంచి అనుబంధం ఉన్న ఆయన.. చిరుతో పట్నం వచ్చిన పతివ్రతలు, మగ మహరాజు, మగధీరుడు, ఖైదీ నం.786, గ్యాంగ్ లీడర్, బిగ్‌బ్యాస్ వంటి చిత్రాలను తెరకెక్కించారు.
డీఎస్ దీక్షితులు: ప్రముఖ రంగస్థల నటుడు డీఎస్ దీక్షితులు ఈ ఏడాది ఫిబ్రవరి 12న కన్నుమూశారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ఆయన ఈ లోకాన్ని వదలివెళ్లారు. మురారి సినిమాలో పూజారిగా ఆయన పాత్రకు మంచి పేరు రాగా.. ఇంద్ర, ఠాగూర్, అతడు వంటి చిత్రాల్లోనూ ఆయన కనిపించారు.
కోడి రామకృష్ణ: టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ డైరక్టర్ కోడి రామకృష్ణ ఈ ఏడాదే కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన., ఫిబ్రవరి 22న మరణించారు. ఆయన మరణం టాలీవుడ్‌కు తీరని లోటును మిగిల్చింది.
రాళ్లపల్లి: కొన్ని వందల తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాళ్లపల్లి మే 17న కన్నుమూశారు. చివరి వరకు కూడా ఆయన తన సేవలను అందించారు.
గిరీష్ కర్నాడ్: ప్రముఖ నటుడు, సాహితీవేత్తగా పేరొందిన గిరీష్ కర్నాడ్ ఈ ఏడాది మరణించారు. అనారోగ్యంతో బాధపడ్డ ఆయన జూన్ 10న తుదిశ్వాస విడిచారు. కన్నడియుడు అయినప్పటికీ.. తెలుగులోనే ఆయన గుర్తుండిపోయే చిత్రాల్లో నటించారు.
విజయ నిర్మల: ప్రముఖ నటి, దర్శకనిర్మాత విజయ నిర్మల ఈ ఏడాది జూన్ 27న హఠాన్మరణం చెందారు. సినిమాల్లో నటించడమే కాదు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకొని.. సినీ ఇండస్ట్రీలోనే తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న ఆమె మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.
దేవదాస్ కనకాల: బహుముఖ ప్రఙ్ఞశాలిగా పేరొందిన దేవదాస్ కనకాల ఈ సంవత్సరం ఆగష్టు 2న కన్నుమూశారు. రెండేళ్ల కిందట దేవదాస్ భార్య లక్ష్మీదేవి కనకాల పరమదించగా.. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం దెబ్బతింటూ వచ్చింది. ఇక ఆయన మరణంతో కనకాల కుటుంబం మరో పెద్ద దిక్కును కోల్పోయింది.
వేణు మాధవ్: కమెడియన్‌గా ఎంతోమంది ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన వేణు మాధవ్ కూడా ఈ ఏడాది కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన పరిస్థితి విషమించగా.. సెప్టెంబర్ 25న తుది శ్వాస విడిచారు. 49ఏళ్ల వయస్సులో ఆయన మరణించడంపై టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. టీమిండియా మాజీ క్రికెటర్ పఠాన్ సైతం ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
గీతాంజలి రామకృష్ణ: సీనియర్ నటి గీతాంజలి రామకృష్ణ హార్ట్ ఎటాక్‌తో అక్టోబర్ 21న మరణించారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఆమె పలు చిత్రాల్లో నటించారు.
గొల్లపూడి మారుతీరావు: లేటు వయసులో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ.. రచయితగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొల్లపూడి మారుతీరావు డిసెంబర్ 12న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం టాలీవుడ్‌లో తీరని లోటును మిగిల్చింది.