Tollywood: ఈ కమెడియన్ గుర్తున్నారా..? ఆయన చివరికి ఎలా చనిపోయారో తెలుసా..?
దివంగత నటుడు ఓంకుచి నరసింహన్ 1936లో కుంభకోణంలో జన్మించారు. ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తూనే నటనపై మక్కువతో సినిమాల్లోకి వచ్చారు. సుమారు 1500 పైచిలుకు చిత్రాల్లో హాస్యపాత్రలతో ప్రేక్షకులను రెండు దశాబ్దాల పాటు అలరించారు. ఆయనకు భార్య సరస్వతి, నలుగురు పిల్లలు ఉన్నారు.

తెలుగు, తమిళ చిత్రసీమల్లో తన విలక్షణమైన రూపం, కీచుగొంతుతో సుమారు 1500 పైచిలుకు సినిమాల్లో హాస్యాన్ని పండించిన సీనియర్ కమెడియన్ ఓంకుచి నరసింహన్. నరసింహన్ అనేది ఆయన అసలు పేరు కాగా, ఓంకుచి అనే పేరు జనం ఆయనకు పెట్టారు. ఈ పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. జపాన్ కరాటే వీరుడు యాంగుచి పేరును పారడీ చేస్తూ, తిలారాజన్ డ్రామా ట్రూప్‌లో నరసింహన్ కరాటే ఫైటర్‌గా, కామెడీ చేసే ఓంకుచి పాత్రలో నటించారు. ఈ నాటకం విజయం సాధించి, ఆయన పేరు ఓంకుచి నరసింహన్‌గా స్థిరపడింది. నరసింహన్ 1936లో తమిళనాడులోని కుంభకోణం నగరంలో జన్మించారు. తన 13వ ఏట అవ్వైయార్ అనే చారిత్రక చిత్రంలో బాలనటుడిగా కనిపించినా, ఆ తర్వాత చదువుపై దృష్టి సారించారు. కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాలనే తపనతో డిగ్రీ పూర్తి చేసి ఎల్ఐసిలో ఉద్యోగం సంపాదించారు. ఆ ఉద్యోగంలో కొనసాగుతూనే సరస్వతి అనే ఆవిడను వివాహం చేసుకున్నారు. ఓంకుచి నరసింహన్‌కు మొత్తం నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు కుమార్తెలు విజయలక్ష్మి, నిర్మల, సంగీత కాగా, ఒక కుమారుడు ఓంకారేశ్వర ఉన్నారు.
బాలనటుడిగా ఒక సినిమా చేసిన తర్వాత, మళ్లీ వెండితెరపై కనిపించడానికి ఆయనకు 30 ఏళ్లు పట్టింది. తిరిగి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత, ఆయనకు లెజెండరీ నటులు, దర్శకుల మద్దతు లభించింది. తమిళ నటుడు సురళి రాజన్, దర్శకుడు విసు కెరీర్ ప్రారంభంలో ఆయనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో కమెడియన్‌గా తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్, రంగనాథ్ వంటి ప్రముఖుల చిత్రాల్లో నటించి మరింత మంచి గుర్తింపు సంపాదించారు. రజినీకాంత్, కమలహాసన్, విజయకాంత్ వంటి అగ్ర హీరోలందరితోనూ కలిసి నటించారు. తెలుగులోనూ ఓంకుచి నరసింహన్ మంచి గుర్తింపు పొందారు. పవిత్రబంధం సినిమాలో ఆయన పోషించిన హాస్యపాత్ర ఎప్పటికీ గుర్తుండుపోతుంది. ఈ చిత్రంలో తన ఇద్దరు కుమార్తెలకు ఒకేసారి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని, రేచీకటి ఉన్న తన చిన్న కుమార్తె వివాహాన్ని బ్రహ్మానందం సహాయంతో సుధాకర్‌తో జరిపించే సన్నివేశాలు, కారుకు తాడు కట్టి జుట్టుకు ముడిపెట్టి ఢిల్లీ వరకు లాగాలని ప్రయత్నించే హాస్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
అర్జున్ నటించిన మాపల్లెలో గోపాలుడులో తలవెంట్రుకలు నిలబడే సన్నివేశం, భారతీయుడులో లారీ డ్రైవర్‌గా, ఒకే ఒక్కడులో వడివేలును హింసించే మావయ్య పాత్రలో, “జెంటిల్‌మెన్” వంటి అనేక చిత్రాల్లో ఆయన అద్భుతమైన హాస్యాన్ని సృష్టించారు. దాదాపు 1500 పైచిలుకు సినిమాల్లో నటించి ఘనమైన ప్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఒకానొక సమయంలో రజనీకాంత్, కమలహాసన్‌ల చిత్రాల్లో ఆయనకు ప్రత్యేకంగా పాత్రలు ఉండేవంటే ఆయన క్రేజ్ ఎంత ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఎల్ఐసి ఉద్యోగం మానేసిన తర్వాత కూడా, పాలసీదారుగా పార్ట్ టైం పనిచేస్తూనే నాటకాలు, సినిమాలు చేస్తూ వచ్చారు. గట్టిగా ఫ్యాన్ పెడితే ఎగిరిపోయే క్యారెక్టర్‌లో ఎవరైనా చేయగలరా? అంటే అందులో ప్రథమ వరుసలో ఓంకుచి నరసింహన్ ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. “ఒకే ఒక్కడు” సినిమాలో ఆయన పాత్ర అందుకు చక్కటి ఉదాహరణ. తెలుగు, తమిళ భాషలతో పాటు దాదాపు 14 భాషల్లో, ఒక ఇంగ్లీష్ చిత్రంలో కూడా నటించడం విశేషం.
వ్యక్తిగతంగా, ఓంకుచి నరసింహన్ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. తన కష్టాన్ని నమ్ముకుని, అందరితో సరదాగా, సంతోషంగా ఉండేవారు. అందుకే అందరూ ఆయన్ని అభిమానించేవారు. తండ్రిగా కొన్ని ఎమోషనల్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఏడిపించిన ఘనత కూడా ఆయనకు ఉంది. అయితే ఎక్కువ శాతం ఆయన చేసినవి హాస్య పాత్రలే. ఈ కామెడీ బిల్డర్ చెన్నైలో 2009, మార్చి 12న గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా లేకపోయినా, ఆయన నటించిన ఏదో ఒక సినిమా చూసినప్పుడు మన పెదాలపై చిరునవ్వులు విరుస్తాయి.



