‘మహర్షి’ మూవీ రివ్యూ.. మళ్లీ తడాఖా చూపిన ప్రిన్స్
సినిమా: మహర్షి దర్శకత్వం: వంశీ పైడిపల్లి నటీనటులు: మహేశ్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేశ్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, ప్రకాశ్ రాజ్, జయసుధ తదితరులు నిర్మాతలు: దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్: కేయూ మోహనన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. మహేశ్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ని దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. […]
సినిమా: మహర్షి దర్శకత్వం: వంశీ పైడిపల్లి నటీనటులు: మహేశ్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేశ్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, ప్రకాశ్ రాజ్, జయసుధ తదితరులు నిర్మాతలు: దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్: కేయూ మోహనన్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. మహేశ్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ని దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. మహేశ్ కెరీర్లో మైల్‌స్టోన్‌గా తెరకెక్కిన ఈ మూవీపై అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకోవడంతో ‘మహర్షి’ కోసం ఎంతగానో ఎదురుచూశారు ప్రేక్షకులు. మరి ఈ రోజు విడుదలైన ‘మహర్షి’ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడా..? మహేశ్ కెరీర్‌లో ఈ చిత్రం మెమరబుల్‌గా మిగిలిపోయిందా..? ఈ విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథ: ఓ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన రిషి కుమార్(మహేశ్ బాబు) తన కష్టంతో అంచెలంచెలుగా ఎదుగుతాడు. చిన్నప్పటి నుంచి ఓడిపోవడం అంటే ఏంటో తెలియని రిషి.. ఫారిన్‌లో ఓ కంపెనీ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. అయితే తన జీవితం, విజయాలు తనొక్కడి కష్టానికి వచ్చిన ప్రతిఫలాలు కాదని, వాటి వెనుక తన ఇద్దరి స్నేహితుల(పూజా హెగ్డే, అల్లరి నరేశ్) కష్టం, త్యాగం కూడా ఉన్నాయని గ్రహిస్తాడు. మరి ఆ స్నేహితుల కోసం రిషి ఏం చేశాడు..? విజయం అంటే డబ్బు సాధించడమే, స్థాయిని పెంచుకోవడమే అనుకునే రిషి.. అసలైన విజయాన్ని ఎలా గుర్తించాడు..? మహర్షిగా ఎలా మారాడు..? అనేదే కథ.
నటీనటుల పర్ఫామెన్స్: మహేశ్ కెరీర్‌లో మైలు రాయి అనే చిత్రానికి ఎలాంటి అంశాలు ఉంటే బాగుంటుందో అవన్నీ జోడించి అల్లుకున్న కథ ‘మహర్షి’. ఇందులో మహేశ్ బాబు అద్భుతంగా నటించాడు. సీఈవోగా, విద్యార్థిగా, రైతుగా మూడు పాత్రలలోనూ వేరియేషన్స్ చూపించాడు మహేశ్. ముఖ్యంగా ఎమోషన్ సీన్లలో మహేశ్ నటన మరోసారి అందరినీ మెప్పిస్తుంది. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన అల్లరి నరేశ్ కథకు మూలస్తంభంగా నిలిచాడు. వైవిధ్యభరితమైన పాత్ర దక్కడంతో ఆ పాత్రకు న్యాయం చేశాడు నరేశ్. గమ్యంలో ‘గాలిశీను’ పాత్రలా ఇందులో రవి పాత్ర అల్లరి నరేశ్ కెరీర్‌లో గుర్తుండిపోతుంది. ఇక హీరోయిన్ పూజాహెగ్డేకు ఇందులో మంచి ప్రాధాన్యత ఉంది. కాలేజీ సన్నివేశాల్లో చిలిపితనంతో ఆకట్టుకున్న పూజా.. పాటల్లో మరింత గ్లామర్‌గా కనిపించింది. వీరితో పాటు ఈ చిత్రంలో నటించిన జగపతిబాబు, రాజీవ్ కనకాల, ప్రకాశ్ రాజ్, జయసుధ తదితరులు తమ తమ పాత్రలలో మెప్పించారు.
ప్లస్ పాయింట్స్: మహేశ్ బాబు, అల్లరి నరేశ్ నటన ఎమోషనల్ సీన్లు యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్: సినిమా నిడివి అక్కడక్కడా స్లో నెరేషన్
విశ్లేషణ: మహేశ్ కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి ఎంచుకున్న కథ బలమైనదే. అక్కడక్కడా కాస్త తడబడ్డా.. తాను అనుకున్న విధంగా మహర్షిని తెరకెక్కించడంలో సఫలమయ్యాడు వంశీ. అయితే ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ ఛాయలు కొన్నిచోట్ల కనిపిస్తాయి. అలాగే నిడివి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సరిపోయేది. ఇక ఈ సినిమాకు తన సంగీతంతో మరో అస్సెట్‌గా నిలిచాడు దేవీ శ్రీ ప్రసాద్. పాటలు పర్వాలేదనిపించినా.. బ్యాక్‌గ్రౌండ్ విషయంలో మాత్రం మరోసారి తన సత్తా చూపించాడు. మోహనన్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి అన్ని విధాలుగా ‘మహర్షి’ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు.. మహేశ్ బాబు ‘మే’ సెంటిమెంట్‌ను కూడా బ్రేక్ చేసిందనే చెప్పొచ్చు.
ఫైనల్ వర్డిక్ట్: మహేశ్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్.