Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
ఈ రోజుల్లో చిన్న సినిమాల్లోనే కామెడీ బాగా జనరేట్ అవుతుంది. విభిన్నమైన కాన్సెప్టులతో సినిమాలు చేస్తున్నారు వాళ్లు. అలా నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా గుర్రం పాపిరెడ్డి. మురళీ మనోహర్ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. అదెలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: గుర్రం పాపిరెడ్డి
నటీనటులు: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, జీవన్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోస్గి తదితరులు
సినిమాటోగ్రఫర్: అర్జున్ రాజా
ఎడిటర్: కార్తిక్ సుమూజ్
సంగీతం: కృష్ణ సౌరభ్
నిర్మాతలు: వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ)
దర్శకుడు: మురళీ మనోహర్
కథ:
జిల్లా కోర్టు జడ్జి జి. వైద్యనాథన్(బ్రహ్మానందం) తెలివితక్కువ వాళ్లను వ్యవహరించడంలో అనుభవజ్ఞుడు. అలాంటి ఆయన దగ్గరకు ఓ విచిత్రమైన కేసు వస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య), సౌధామిని (ఫరియా అబ్దుల్లా), మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోసి) కలిసి శ్రీశైలం అడవుల్లో సమాధి చేసిన ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్తారు. అక్కడున్న శవాన్ని తీసుకొచ్చి శ్రీ నగర్ కాలనీలో ఉన్న స్మశానంలో పాతడానికి ట్రై చేస్తారు. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లిన వాళ్లకు శ్రీశైలం స్మశానంలో మరికొందరు గ్రేవ్ రాబర్స్ కూడా పోటీకి వస్తారు. ఆ దొంగలతో ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రీశైలం అడవుల్లో పాతిపెట్టిన ఆ శవం ఎవరిది..? అసలు వాళ్లెందుకు ఆ శవాన్ని తీసుకొచ్చి శ్రీ నగర్ కాలనీలో పూడ్చాలనుకుంటారు..? దాని కోసం హీరో గ్యాంగ్‌తో పాటు మరికొన్ని గ్యాంగ్స్ ఎందుకు వేట సాగిస్తున్నాయి.? ఈ వేట కథను ఉడ్రాజు (యోగిబాబు) ఎలా మలుపుతిప్పాడు..? 1927 నుంచి 1987 వరకు జీవించిన కలింగ పోతురాజు ఎవరు..? మార్కండేయ రాజుతో ఈ కథకున్న లింకు ఏంటి.. అసలు కథలో మెయిన్ భాగమైన గొయ్యి అలియాస్ గవర్రాజు (జీవన్) పాత్ర ఏంటి.? అనేది అసలు కథ..
కథనం:
ఈ మధ్య చిన్న సినిమాల్లోనే ఎక్కువగా కామెడీ వర్కవుట్ అవుతుంది. అందులో డార్క్ కామెడీ ఇంకా బాగా వర్కవుట్ అవుతుంది. అలా ప్రయత్నించిన సినిమానే గుర్రం పాపిరెడ్డి. ఫస్ట్ సీన్ నుంచే అదే దారిలో వెళ్లాడు దర్శకుడు మురళీ మనోహర్. చాలా ఆసక్తికరంగా కథను మొదలుపెట్టాడు. తొలి 10 నిమిషాల్లోనే కథలోకి తీసుకెళ్లాడు.. అక్కడ్నుంచి శవాల దొంగతనం.. వాటిని మార్చడం.. వాటికోసం హీరో అండ్ టీం పడే ఇబ్బందులు ఫన్నీగా అనిపిస్తాయి. యోగిబాబు కామెడీ కూడా పర్లేదు. మనోడు ఉన్న సీన్స్ అన్నీ బాగానే రాసుకున్నాడు దర్శకుడు మురళీ. ఇంటర్వెల్ వరకు సరదా సరదా సన్నివేశాలతో బాగానే లాక్కొచ్చాడు. ప్రీ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తి బాగానే పెంచేసింది. సెకండాఫ్ మొదట్లో కాస్త నెమ్మదిగా సాగుతుంది కథ.. దానికితోడు స్క్రీన్ ప్లే కూడా మరీ స్లోగా ఉంటుంది. మళ్లీ ఫ్లాష్ బ్యాక్స్ అన్నీ అయిపోయాక ప్రీ క్లైమాక్స్ నుంచి కథ గాడిన పడుతుంది. కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయి.. వాటిపై దర్శకుడు మరింత శ్రద్ధ తీసుకుని ఉండుంటే బాగుండేది. కసిరెడ్డి, వంశీధర్ మధ్య వచ్చే సీన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. అలాగే బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత ఎక్కువ సేపు స్క్రీన్ మీద కనిపించారు. శవాలు మార్చేసే సీన్స్, ఆ తర్వాత వచ్చే కొన్ని కొనసాగింపు సన్నివేశాలు బాగానే నవ్వించారు. సింపుల్ కథను తీసుకుని.. దానికి వందల ఏళ్ళ నాటి సంస్థానాలకు లింక్ పెట్టడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. కాకపోతే అందులోనే మరింత ఫన్ జనరేట్ చేసే అవకాశం ఉన్నా కూడా ఎందుకో దర్శకుడు యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపించినా.. లీడ్ యాక్టర్స్ అంతా తమ కామెడీతో సినిమాకు బాగా హెల్ప్ అయ్యారు.
నటీనటులు:
నరేష్ అగస్త్య నటనలో చాలా ఈజ్ ఉంది.. మనోడు స్క్రీన్ మీద చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ఫరియా అబ్దుల్లా అటు గ్లామర్ డోస్‌తో పాటు కామెడీలోనూ బాగానే మెప్పించింది. పైగా చివర్లో ఓ పాట కూడా పాడింది. బ్రహ్మానందం నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి…? ఆయన ఉన్న సీన్స్ పర్లేదు.. కాకపోతే డబ్బింగ్ కాస్త చూసుకోవాల్సింది. తమిళ కమెడియన్ యోగి బాబును తీసుకున్నారు కానీ ఆయనకు తగ్గ వెయిటేజ్ ఉన్న పాత్ర ఇవ్వలేదు. జీవన్‌కు చాలా మంచి పాత్ర పడింది.. మనోడే సినిమాకు బాగా ప్లస్ అయ్యాడు. రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోస్గి కాంబినేషన్ సీన్స్ బాగానే నవ్వొచ్చాయి.. ముఖ్యంగా కాసిరెడ్డి సీన్స్..!
టెక్నికల్ టీం:
డార్క్ కామెడీలకు సంగీతం కంటే నేపథ్య సంగీతమే కీలకం.. ఇందులో కృష్ణ సౌరభ్ పర్లేదనిపించాడు. ఎడిటింగ్ కూడా ఓకే.. అక్కడక్కడా కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి. వాటిని కూడా చూసుకుంటే ఇంకా బాగుండేది.. దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఎడిటర్‌ను ఏమనలేం. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్లుగానే ఉన్నాయి. దర్శకుడిగా మురళీ మనోహర్ కథను ఆసక్తికరంగా రాసుకున్నాడు కానీ కథనంలో కాస్త తడబడ్డాడు. ఇంకాస్త టైట్ స్క్రీన్ ప్లే రాసుకుని.. ఫన్‌పై కాన్సట్రేషన్ చేసుంటే గుర్రం పాపిరెడ్డి మంచి కామెడీ ఎంటర్టైనర్ అయ్యుండేది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా గుర్రం పాపిరెడ్డి.. మరీ రేసుగుర్రం కాదు కానీ.. ఓ మాదిరి గుర్రం..!








