నయనతార మహాశక్తి మూవీ ట్రైలర్‌పై ట్రోల్స్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన దర్శకుడు
హీరోయిన్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే మహాశక్తి అనే సినిమాలో నటిస్తుంది నయన్.

కోలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రాల్లో నయనతార నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘మహాశక్తి’) ఒకటి. సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వేల్స్ ఇంటర్నేషనల్‌తో పాటు దర్శకుడు సుందర్ సి, నయనతార ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తుండగా.. మరో హీరోయిన్ రెజీనా కసాండ్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మూవీ టీమ్. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అయితే ఈ చర్చ సినిమాకు పాజిటివ్‌గా కాకుండా ట్రోల్స్ రూపంలో మారడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ట్రైలర్‌లోని విజువల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేవంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా, సినిమాకు సరైన బడ్జెట్ కేటాయించకపోవడంతోనే ఏఐ టెక్నాలజీని ఉపయోగించారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ విమర్శలు చిత్రబృందం దృష్టికి వెళ్లడంతో దర్శకుడు సుందర్ సి తాజాగా స్పందించారు. చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన.. సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణుల కష్టాన్ని గుర్తించాలని కోరారు. దాదాపు 400 మంది సీజీఐ కళాకారులు ఏడాదిన్నర పాటు రాత్రింబవళ్లు శ్రమించి ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించారని తెలిపారు..
ఈ సినిమాలో మొత్తం 3,000 సీజీఐ షాట్లు ఉన్నాయని, వాటిలో కేవలం 15 షాట్లకు మాత్రమే ఏఐ టెక్నాలజీని ఉపయోగించినట్లు స్పష్టం చేశారు. మిగిలిన విజువల్స్ అన్నింటినీ టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి రూపొందించారని తెలిపారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఏఐతో సినిమా తీశారంటూ ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని అన్నారు. విజువల్స్ నచ్చితే అభినందించాలని, నచ్చకపోతే విమర్శించవచ్చని.. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని సుందర్ చెప్పుకొచ్చారు. దీంతో మహాశక్తి ట్రైలర్ చుట్టూ మొదలైన ఏఐ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదల తర్వాత ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




