TSRTC Buses: ఒకటే నెంబర్.. మూడు ఆర్టీసీ బస్సులు.. ట్రాఫిక్ చలాన్లతో బండారం బట్టబయలు!
ఆర్టీసీలో రెండు బస్సులు ఒకే నంబర్‌పై తిరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి చెందిన బస్సుల్లోనూ ఈ మాయాజాలం కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
TSRTC Buses: ఒకటే నెంబర్.. మూడు బస్సులు.. గతంలో ప్రైవేట్ ట్రావెల్స్‌లు ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడేవి.. ఒక పర్మిట్‌పై నాలుగైదు సర్వీసులు.. ఇలా ఎడాపెడా బస్సులు తిప్పేయడం ప్రైవేట్ ట్రావెల్స్‌కు సర్వసాధారణం. అడపా దడపా ఆర్టీఏ అధికారులు పట్టుకుంటే ఫైన్లు కట్టేసి తప్పించుకోవడమో.. లేక అధికారులను కాకా పట్టడమో మామూలే. అయితే ఆర్టీసీలో రెండు బస్సులు ఒకే నంబర్‌పై తిరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి చెందిన బస్సుల్లోనూ ఈ మాయాజాలం కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తెలంగాణ ఆర్టీసీలో ఒకే నెంబర్‌తో మూడు బస్సులు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. గరుడ ప్లస్, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ ఈ మూడు బస్సులకు ఒకేనెంబర్ ఉంది. ఆ మూడు బస్సుల మీద ఫైన్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్ వన్ డిపోలో టీఎస్ 08 z 0208 నంబర్‌తో ఉన్న బస్సు ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌గా నడుస్తోంది. హైదరాబాద్ 3 డిపోలోని గరుడ ప్లస్ సర్వీస్ కూడా అదే నంబర్‌పై తిరుగుతుండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ మూడు బస్సులను గుర్తించిన ఆర్టీవో అధికారులు వాటిపై చలాన్లు విధించారు. టీవీ9 నిఘాలో ఈ విషయం బయటపడింది.
ఒకే నెంబర్ పై ఉన్న ఈ మూడు బస్సులకు హైదరాబాద్ పరిధిలో రెండు, సైబరాబాద్ పరిధిలో రెండు చలాన్లు ఉన్నాయి. రాచకొండ, ఆదిలాబాద్, సిద్ధిపేట, కరీంనగర్ పరిధిలోనూ ఒక్కో చలాన్ ఉంది. మొత్తంగా ఒకే నెంబర్‌పై ఎనిమిది ఫైన్లు ఉన్నాయి. కానీ బస్సులు మాత్రం మూడు ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన అర్టీవో అధికారులు అసలు వ్యవహారాన్ని గుర్తించారు. అయితే, అసలు ఒకే నెంబర్ మీద మూడు బస్సులు ఎలా తిరుగుతున్నాయి?. ఆ బస్సులకు ఒకే నెంబర్ ఎందుకు కేటాయించారనేది అర్ధం కావడం లేదు. దీనిపై ఆరా తీస్తున్నారు అధికారులు.
గతంలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఒకే నెంబర్ మీద రెండు అంతకంటే ఎక్కువ బస్సులను నడిపిన సందర్భాలున్నాయి. అయితే టిఎస్ ఆర్టీసీ ఇప్పుడు ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఒకే నెంబర్ మీద మూడు బస్సులు ఎలా ఉన్నాయి? ఈ తప్పు ఎలా జరిగిందని అటు టిఎస్‌ఆర్టీసీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. తప్పు ఎక్కడ జరిగిందో వెతికే పనిలో పడ్డారు. ఈ మూడు బస్సులు ఎప్పటి నుంచి తిరుగుతున్నాయి? ఇప్పటి వరకు దీన్ని ఎందుకు గుర్తించలేదని అధికారులు ఆరా తీస్తున్నారు.
Read Also… Dhanteras Business: ధన్‌తేరాస్ రోజు జోరందుకున్న బంగారం కొనుగోళ్లు.. ఎంతో తెలిస్తే షాకవుతారు..!