Hyderabad Black Market: బ్లాక్‌లో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్.. అధికారుల నిఘాతో అక్రమ దందాకు చెక్.. అరెస్టైన వారిలో గాంధీ ఉద్యోగి!
నిన్న మొన్నటి వరకు కరోనా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమ్‌డిసివర్ బ్లాక్ చేసిన కంత్రీగాళ్లు.. తాజా బ్లాక్ ఫంగస్ బాధితులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను అక్రమ దందాకు తెరలేపారు.
Hyderabad Injections Black Market: సందర్భం ఏదైనా సరే, అవకాశమున్నప్పుడల్లా కేటుగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కరోనా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమ్‌డిసివర్ బ్లాక్ చేసిన కంత్రీగాళ్లు.. తాజా బ్లాక్ ఫంగస్ బాధితులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను అక్రమ దందాకు తెరలేపారు.
హైదరాబాద్ మహానగరంలో వేర్వేరు చోట్ల అక్రమంగా విక్రయిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో గాంధీ ఆస్పత్రి ఔట్‌సోర్సింగ్ మహిళా ఉద్యోగి ఉండటం విశేషం. బ్లాక్ ఫంగస్ బాధితులకు వినియోగించాల్సిన ఇంజెక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తుండగా పేట్ బషీర్‌బాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నాలుగు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో దాడిలో అపోలో ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి రెండు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.35 వేల నుంచి రూ.40 వేలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు సరూర్‌నగర్‌లోనూ ఈ ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న కూకట్ పల్లికి చెందిన మనీశ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో ఇంజక్షన్‌ను అమ్ముతుండగా రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకున్నారు. ఒక్కో ఆంపోటెరిస్సిన్ – B ఇంజెక్షన్ 35 వేలకు అమ్ముతున్న మనీష్. పోలీసులకు సమాచారం రావడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.