Terror Funding Case: జమ్మూకాశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు.. 45 ప్రాంతాల్లో కొనసాగుతున్న తనిఖీలు..
Jammu And Kashmir: ఉగ్రవాదులకు నిధుల కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం
Jammu And Kashmir: ఉగ్రవాదులకు నిధుల కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే జమ్మూకాశ్మీర్‌లోని 14 జిల్లాల్లోని 45 ప్రాంతాల్లో ఒక్కసారిగా సోదాలు ప్రారంభించింది. ఎన్‌ఐఏ, సీఆర్‌పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిషేధిత జమాతే ఈ ఇస్లామి సంస్థకు చెందిన సభ్యుల ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు. సంస్థపై నిషేధం తర్వాత దాని సభ్యుల కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. వేర్పాటువాద, పాకిస్థాన్ అనుకూల సంస్థ అయిన జమాతే-ఇ-ఇస్లామిపై కేంద్ర ప్రభుత్వం 2019లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే.. మళ్లీ జమ్మూలో ఉగ్రవాద పునాదులకు నిధులు సమకూరుస్తున్నట్లు సమచారం అందడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది.
ఈ మేరకు సీనియర్ డీఐజీ నేతృత్వంలో ఎన్‌ఐఏ బృందం ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లింది. కాశ్మీర్‌లోని శ్రీనగర్, బుద్గాం, గండర్‌బాల్, బారాముల్లా, కుప్వారా, బందిపోరా, అనంత్‌నాగ్, షోపియాన్, పుల్వామా, కుల్గాం, రామ్‌బన్, దోడా, కిష్ట్‌వార్, రాజౌరీ జిల్లాల్లో తెల్లవారు జాము నుంచే దాడులు నిర్వహిస్తోంది. ఇదిలాఉంటే.. గత నెల 31న కూడా కేంద్రపాలిత ప్రాంతంలోని 14 చోట్ల సోదాలు చేపట్టింది. లష్కర్-ఇ-ముస్తాఫా చీఫ్ హిదయాతుల్లా అరెస్టు నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించింది. కాగా ఈ దాడుల నేపథ్యంలో టెర్రర్ ఫండింగ్‌కు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచేందుకు నిషేధిత జమాతే ఈ ఇస్లామి సంస్థ సభ్యులు పూనుకుంటున్నారని భద్రతా అధికారులకు సమాచారమందింది.
Also Read: