Dowry Death: పెళ్లైన రెండు నెలలకే తప్పని వరకట్న వేధింపులు.. దుబ్బాకలో నవ వధువు ఆత్మహత్య..!
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, ఎంత మందికి శిక్ష విధించినా జనంలో మార్పు రావడం లేదు.. వరకట్న దాహంతో అబలలను బలి తీసుకుంటూనే ఉన్నారు.
Newly Bride Dowry Death: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, ఎంత మందికి శిక్ష విధించినా జనంలో మార్పు రావడం లేదు.. వరకట్న దాహంతో అబలలను బలి తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా అత్తింటి ఆరళ్లకు కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో గురువారం జరిగింది. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దుబ్బాక ఎస్‌ఐ మన్నె స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ రెండో వార్డుకు చెందిన అక్కల రాధా కిషన్ గౌడ్, లక్ష్మిల పెద్ద కుమార్తె పవిత్ర అలియాస్ తేజస్విని(22)ని దుబ్బాక మండలంలోని గంభీర్‌పూర్ గ్రామానికి చెందిన చేపూరి యాదయ్య, బాలలక్ష్మిల ఏకైక కుమారుడు శ్రీకాంత్ గౌడ్‌కు ఇచ్చి మే 28, 2021న వివాహం చేశారు. వివాహం సమయంలో ఒప్పుకున్న దాని ప్రకారం లాంఛనాలు ఇచ్చి పెళ్లి జరిపించారు. ఇదే క్రమంలో పెళ్లి సమయంలో ఒప్పుకున్న మరి కొంత సొమ్ము రావల్సివుంది. దీంతో పవిత్ర అత్తింటికి వచ్చిన నాటినుంచి భర్త, అత్త తీవ్రంగా వేధించసాగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పవిత్ర ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
కాగా, బుధవారం బీఎడ్ సెమిస్టర్ పరీక్ష ఉండటంతో ఆమెను భర్త శ్రీకాంత్ గౌడ్ దుబ్బాకలోని కళాశాల వద్ద వదిలి వెళ్లాడు. పరీక్ష రాసిన తర్వాత ఆమె తన అన్న స్నేహితుడికి సెల్‌ఫోన్ ద్వారా తనకు జీవితంపై విరక్తి కలిగిందంటూ మెసేజ్ చేసి.. ఫోన్ స్విచ్ ఆపేసింది. ఆ తర్వాత కళాశాల నుంచి కాలినడకన వెళ్లి పట్టణ శివారులోని పెద్దచెరువులో దూకింది. పవిత్ర అన్న స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు, బంధువులు దుబ్బాక పట్టణంలో గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు బుధవారం రాత్రి దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పవిత్ర మృతదేహం చెరువు నీటిలో తేలగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని సిద్దిపేట ఇన్‌ఛార్జి ఏసీపీ సైదులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్తింటి ఆరళ్ల భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పవిత్ర తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Read Also… Hyderabad: మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి.. ఆరుగురు యువతులు సహా 8 మంది అరెస్ట్