రేషన్ సరుకులు అందిస్తామని డబ్బుల వసూలు.. 8 లక్షలతో ఎస్కేప్.. ఒక్కొక్కరి నుంచి ఎంత తీసుకున్నారంటే..
Man Cheats People : పదిహేను నెలల పాటు రేషన్ సరుకులు అందిస్తామని ఓ వ్యక్తి కొంతమంది దగ్గరి నుంచి రూ.8 లక్షలు వసూలు చేసి పారిపోయాడు.
Man Cheats People : పదిహేను నెలల పాటు రేషన్ సరుకులు అందిస్తామని ఓ వ్యక్తి కొంతమంది దగ్గరి నుంచి రూ.8 లక్షలు వసూలు చేసి పారిపోయాడు. నిందితుడు ఢిల్లీలోని నాంగ్లోయి నివాసి రాజేష్ కుమార్‌గా గుర్తించారు. తాజాగా పోలీసులకు చిక్కడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజేశ్ అతడి టీమ్ ఒక ఎన్జీవో సంస్థ నూతన పథకాన్ని ప్రవేశపెట్టిందని జనాలను నమ్మించారు. దాని ప్రకారం 15 నెలల కాలానికి అతి తక్కువ ధరతో రేషన్ సరుకులు అందిస్తారని పేర్కొన్నారు. 15 నెలల కాలానికి బియ్యం, చక్కెర, నూనె అందిస్తారని నమ్మబలికారు. అందుకోసం ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.500 నుంచి రూ.1500 వరకు వసూలు చేశారు. మొత్తం రూ.8 లక్షల వరకు పోగేసి ఉడాయించారు.
అయితే హరేష్ కుమార్ అనే వ్యక్తితో పాటు మోసపోయిన బాధితులు 534 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో కొంతమందికి రేషన్ కార్డు అందించి సరుకులు కూడా అందించారని.. అందరు నమ్మి డబ్బులు కట్టడంతో వాటిని తీసుకొని అదృశ్యమయ్యారని తెలిపారు. దీంతో దర్యాప్తు ప్రారంబించిన పోలీసులు ఆ ఎన్జీవో గురించి ఆరాతీస్తే తమకు ఎలాంటి సమాచారం లేదని, ఆ వ్యక్తులు ఎవరో కూడా తమకు తెలియదని బదులిచ్చింది. ఈ పథకాన్ని నడిపిన ప్రధాన వ్యక్తి రాజేష్ అని దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు అతన్ని నాంగ్లోయి ప్రాంతంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.