ఆధార్ లింక్ ఉంటేనే భాగ్యనగరంలో ఉచిత నీటి పథకం.. మరో నెల రోజుల పాటు గడువు పొడిగింపు
భాగ్యనగర్ వాసులకు ఉచిత మంచినీటి సరఫరా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సరియైన లబ్దిదారులకు ఈ పథకం చేరేలా చర్యలు చేపట్టింది.

Water users can link Aadhaar : భాగ్యనగర్ వాసులకు ఉచిత మంచినీటి సరఫరా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సరియైన లబ్దిదారులకు ఈ పథకం చేరేలా చర్యలు చేపట్టింది. జీహెచ్ ఎం సి ఎన్నికల హామీలో భాగంగా నగరవాసులకు ప్రతి నెలా 20 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా అందించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో నల్లా కనెక్షన్ నంబరుతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు.
గ్రేటర్‌లో నీటి మీటర్ల ఏర్పాటు, నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్ అనుసంధానం కోసం మరో ఎనిమిది రోజులే గడువు ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 31 వరకు ఉన్న ఆ గడువును ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి వేదికగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. తాజాగా గడువు పెంపుతో ప్రతి నల్లాకు నెలకు ఉచితంగా 20వేల లీటర్ల తాగునీటి సరఫరాను మరింత మంది పొందే అవకాశం కలిగిందని మంత్రి వెల్లడించారు.
నీటి మీటర్ ఏర్పాటు, నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా జలమండలి కసరత్తు ముమ్మరం చేసింది. ప్రతి డివిజన్ ఆఫీస్‌లో ఆధార్ అనుసంధానం కౌంటర్, నల్లా మీటర్ల బిగింపునకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు స్వయం సహాయక బృందాలను ఇంటింటికీ పంపించి నల్లాలకు మీటర్ల బిగింపు ప్రక్రియను చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో మొత్తం 10.60 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1.96 లక్షల నల్లాలు మురికివాడలు, బస్తీలు ఉన్నాయి. వీటికి నల్లా మీటర్ల నుంచి మినహాయింపు ఉంది. మిగతా సుమారు రెండు లక్షల గృహ వినియోగ నల్లాలకు నీటి మీటర్లు లేవు. మరో 5.67 లక్షల నల్లాల్లో కొన్నింటికి మీటర్లు ఉన్నా ఎక్కువ శాతం పనిచేయని మీటర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు విధిగా వాటి స్థానంలో కొత్త మీటర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం లక్ష మంది వరకు నల్లాలకు మీటర్లు బిగించుకుని ఉచిత తాగునీటి పథకం సద్వినియోగం చేసుకున్నారు.
మరోవైపు, అపార్ట్‌మెంట్లపై జలమండలి తాజాగా దృష్టి సారించింది. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో సుమారు పది వేలకు పైగా ఉన్న అపార్ట్‌మెంట్లలో సుమారు లక్షకు పైగా ప్లాట్స్ ఉన్నాయి. వీరంతా విధిగా తమ నల్లా కనెక్షన్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే, అపార్ట్‌మెంట్లలో ఉండే యాజమానులంతా వారీ వారీ జీహెచ్‌ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ టిన్ నంబరు, ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే ఉచిత నీటి పథకం వర్తిస్తుంది. ఈ క్రమంలోనే వినియోగదారుల సౌకర్యార్థం నీటి మీటర్లు కొనుగోలు చేసేందుకు జలమండలి 24 ఏజెన్సీలను ఎంపిక చేసింది.
వినియోగదారు వాటర్ కనెక్షన్ నంబరు (క్యాన్) ఆధార్ నంబర్‌తో అనుసంధానం ఇలా…
- సమీపంలోని ‘ మీ -సేవా’ కేంద్రం ద్వారా నీటి కనెక్షన్ వినియోగదారుల అకౌంట్ నంబరు (క్యాన్)ను ఆధార్ నంబరుతో అనుసంధానం చేసుకోవాలి.
- వాటర్‌బోర్డు వెబ్‌సైట్ www.hyderabadwater.gov.in లాగిన్ కావాలి.
- కన్య్సూమర్ అకౌంట్ నంబరు, ఆధార్ కార్డులోని పేరు, వాటర్‌బోర్డు నీటి బిల్లుపై వినియోగదారుని పేరు ఒకేలాగా ఉండాలి.
- సొసైటీస్/రెసిడెన్షియల్ వెల్ఫే ర్ అసోసియేషన్ వినియోగదారులు మాత్రం వారీ వారీగా అసోసియేషన్ సభ్యుడై ఉండాలి.
- ఆధార్ కార్డు నంబరును కన్స్యూమర్ అకౌంట్ నంబర్‌తో లింక్ చేసే ధ్రువీకరించిన అధికార పత్రం సమర్పించాలి.
- ఏవైనా సందేహాలు ఉంటే వాటర్‌బోర్డు కస్టమర్ కేర్ 155313నా సంప్రదించాలి. బస్తీల్లో నివసిస్తున్న గృహ వినియోగదారులకు మీటర్ అవసరం లేదు.
అపార్ట్‌మెంట్ వాసులు ఆన్ లైన్ ద్వారా అనుసంధానం ఇలాః
- www.hyderabadwater.gov.in కు లాగిన్ అవ్వాలి.
- అనంతరం ఆధార్ అనుసంధానం అన్న ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- కుళాయి కనెక్షన్ కు ఇచ్చిన (అపార్ట్‌మెంట్)మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది.
- ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఎక్స్‌ఎల్ షీట్ ఓపెన్ అవుతుంది.
- అప్పుడు ఫ్లాట్ యజమాని పేరు, పీటీఐఎన్ నంబరు, అనంతరం ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి.
- వెంటనే ఆధార్ నంబరుకు లింక్ చేసిన మొబైల్ నంబరుకు మరో ఓటీపీ మెసేజ్ అందుతుంది.
- ఈ ఓటీపీ ని ఎంటర్ చేసిన వెంటనే టాప్ కలెక్షన్ కోసం ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది
కాగా, ఆధార్ లింక్ చేసే సమయంలో ఇబ్బందులు ఏర్పడితే.. 155313 నెంబర్‌కు కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని జలమండలి అధికారులు తెలిపారు.
Read Also… City On Mars: మార్స్‌పై సరికొత్త ప్రయోగం.. అంత డబ్బు మీవద్ద ఉందా?.. మార్స్‌పైకి మీరూ వెళ్లొచ్చు…