Hanumakonda Petrol Attack: హన్మకొండలో దారుణం.. చిట్‌ఫండ్ మోసాలను నిలదీసినందుకు వ్యక్తిపై పెట్రోల్ దాడి..
Hanumakonda Petrol Attack: ప్రైవేట్ చిట్‌ఫండ్స్ దందా రోజు రోజుకు పెరుగుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని మాటలతో నమ్మించి చిట్టీల పేరుతో
Hanumakonda Petrol Attack: ప్రైవేట్ చిట్‌ఫండ్స్ నిర్వాహకుల అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని మాటలతో నమ్మించి చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేయడం పరిపాటైపోయింది. చోటా మోట నాయకుల అండదండలతో లక్షల రూపాయాలు వసూలు చేసి ప్రశ్నించిన వారిని బెదిరించడం, దాడులు చేయడం చేస్తున్నారు. ఏదో ఒక అవసరం కోసం చిట్టీవేసి లిఫ్ట్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా కస్టమర్లను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా హన్మకొండలో చిట్టీ డబ్బులు అడిగినందుకు ఓ వ్యక్తిపై పెట్రోల్ దాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హన్మకొండలోని టైలర్ స్ట్రీట్‌లో రాజు అనే వ్యక్తి సెల్ ఫోన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అచల చిట్‌ఫండ్‌లో చిట్టివేసి మూడు నెలల క్రితం లిఫ్ట్ చేశాడు. అప్పటి నుంచి కంపెనీ చిట్టీ డబ్బులు ఇవ్వకుండా రేపు, మాపంటూ కాలం వెళ్లదీస్తుంది. దీంతో విసుగు చెందిన రాజు డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ చిట్స్ కార్యాలయం వద్ద ఏజెంట్‌ని గట్టిగా నిలదీశాడు. ప్రతీకారంగా ఇద్దరు దుండగులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.