Lucky Draw Scam: ఆర్మూర్‌లో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ. ఆరు కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..
Lucky Draw Scam: ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు, బహుమతులను ఎరగా చూపి జేబుళ్లోని డబ్బులను కొట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘరానా మోసమే నిజమాబాద్ జిల్లా ఆర్మూర్...
Lucky Draw Scam: ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు, బహుమతులను ఎరగా చూపి జేబుళ్లోని డబ్బులను కొట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘరానా మోసమే నిజమాబాద్ జిల్లా ఆర్మూర్‌లో వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ కేంద్రంగా రెహమాన్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో లక్కీ డ్రా దందాను మొదలు పెట్టారు. నెలకు కొంత కడితే.. కార్లు, బంగారు నాణాలు, టీవీలు, కూలర్లు, వాషింగ్ మిషన్లు గెలుచుకోవచ్చని ప్రజలకు ఆశ చూపారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పాంప్లెట్లు ముద్రించి పంచి పెట్టారు. దీంతో వెనకాముందు చూడని జనాలు పెద్ద ఎత్తున లక్కీ డ్రా కోసం డబ్బులు కట్టారు. ఇలా భారీగా డబ్బు పోగు కాగానే బోర్డు తిప్పేశారు. ఏజెంట్ల ద్వారా ఏకంగా రూ. 6 కోట్లు వసూళు చేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు. దీంతో డబ్బుల కట్టి మోసపోయిన వారంతా.. లబోదిబో మంటున్నారు.
ఇది తొలిసారి కాదు..
నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి మోసం జరగడం ఇదే తొలిసారి కాదు. కొన్ని రోజుల క్రితం షైన్ లక్కీ డ్రా పేరుతో దందా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులను వసూళు చేశారు. మొదట్లో అందరికీ నమ్మకం కలిగేలా కొంత మందికి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి తాము కోరుకున్న డబ్బు జమ కాగానే రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకున్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇలా ఆర్మూర్ కేంద్రంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1 వరకు లక్కీడ్రా ఏజెన్సీలు నడుస్తున్నాయి. ఒక్కో ఏజెన్సీలో ఏకంగా 3500 మంది సభ్యులు చేర్చుకుంటున్నారు. ఒక్కో వ్యక్తి నుంచి నెలకు కనీసం రూ. 2 వేలు వసూళు చేస్తున్నారు. సభ్యులను పెంచుకునే క్రమంలో స్థానికంగా గ్రామాల్లో ఉండే వారిని నియమించుకొని మరీ దాందాను సాగిస్తున్నారు. అయితే ఈ అక్రమ దందాలు ఇంతలా సాగడానికి రాజకీయ నాయకుల సహకారం కూడా అందుతుందని కొందరు వాదిస్తున్నారు. ఇక పోలీసులు కూడా వీటిని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి మోసాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే లక్కీ డ్రా ఏజెన్సీలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
(ప్రభాకర్, టీవీ9 తెలుగు, నిజమాబాద్. )
Also Read: Coronavirus: కరోనా మహమ్మారి పూర్తిగా చైనా సృష్టే.. అమెరికా రిపబ్లికన్ల తాజా నివేదికలో వెల్లడి!
Murder: మామతో కలిసి భర్తను చంపిన మహిళ.. వివాహేతర సంబంధమే కారణం.? మంచంపైనే ప్రాణాలు వదిలిన..