AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణాపాయం ఉందని 6 నెలల నుంచీ ప్రాధేయపడుతున్నారు.. చీఫ్‌ జస్టిస్‌కే మొరపెట్టుకున్నారు. చివరికి ఊహించిందే అయింది

Lawyer Couple Murder : అవును, ముమ్మాటికీ వ్యవస్థలో లోపమే. చావు భయం ఉందని ఆ లాయర్ దంపతులు ముందుగానే బోరుమన్నారు. కాపాడాలని ఆరు నెలల నుంచీ

ప్రాణాపాయం ఉందని 6 నెలల నుంచీ ప్రాధేయపడుతున్నారు.. చీఫ్‌ జస్టిస్‌కే మొరపెట్టుకున్నారు. చివరికి ఊహించిందే అయింది
Venkata Narayana
|

Updated on: Feb 18, 2021 | 12:44 PM

Share

Lawyer Couple Murder : అవును, ముమ్మాటికీ వ్యవస్థలో లోపమే. చావు భయం ఉందని ఆ లాయర్ దంపతులు ముందుగానే బోరుమన్నారు. కాపాడాలని ఆరు నెలల నుంచీ ప్రాధేయపడుతున్నారు. ఏకంగా చీఫ్‌ జస్టిస్‌కే మొరపెట్టుకున్నారు. సిస్టమ్‌లో నిర్లక్ష్యం ఎక్కడ మొదలైందో గానీ.. చివరికి వాళ్లు ఊహించిందే జరిగింది. నిట్టనిలువుగా ఇద్దరు ప్రాణాలు పోడానికి కారణమైంది. పెద్దపల్లి జిల్లాలో జంట హత్యల కేసు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. లాయర్‌ దంపతుల హత్యపై భగ్గుమంటున్నారు న్యాయవాదులు. తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించి నిరసనలకు దిగారు. మరోవైపు ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్‌ వేశారు సుప్రీంకోర్ట్‌ లాయర్‌ శ్రవంత్‌ కుమార్‌.

అడ్వొకేట్‌ దంపతుల హత్య కేసును సుమోటోగా స్వీకరించింది హైకోర్టు. వామన్‌రావు దంపతుల హత్యపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్దిష్ట కాలపరిమితిలోగా విచారణ పూర్తి చేయాలన్న కోర్టు..న్యాయవాదుల హత్యకేసు విచారణను మార్చి 1కి వాయిదా వేసింది. ఇలాంటి హత్యలు పునరావృతం కాకూడదంటూ నినాదాలు చేస్తున్నారు న్యాయవాదులు. తమకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేస్తున్నారు. లాయర్లకు రక్షణ లేకుండా పోయిందంటూ మండిపడుతున్నారు.

లాయర్‌ దంపతులను అత్యంత కిరాతకంగా నడిరోడ్డుపై చంపడం దారుణమన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. వారిపై హైకోర్టులో కేసులు పెట్టిన కారణంగానే వామనరావ్‌ దంపతులను నరికి చంపారని అంటున్నారు. న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని..మంథని పోలీసులు దిగజారి ప్రవర్తించారని ఆరోపించారు. వామన్‌రావు హత్యకేసులో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. వామన్‌రావు తండ్రి ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేశారు రామగిరి పోలీసులు. ఏ1గా వసంతరావు, ఏ2గా కుంట శ్రీనివాస్‌, ఏ3గా కుమార్‌ను చేర్చారు. వారిపై 120బీ, 302, 341, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇక వామన్‌రావు దంపతులకు పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్‌ మార్టం నిర్వహిస్తున్నారు. మరికాసేపట్లో స్వస్థలం గుంజపడుగుకు తరలిస్తారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో గుంజపడుగులో భారీ బందోబస్త్‌ ఏర్పాటుచేశారు. ఇక విపక్షాల పిలుపుతో మంథనిలో బంద్‌ కొనసాగుతోంది. వామన్‌రావు దంపతుల హత్యకు నిరసనగా బంద్‌ పాటిస్తున్నారు. బంద్‌కు ప్రజాసంఘాలు, కుల సంఘాలు మద్దతు తెలిపాయి.

తమ కారును ఆపి అద్దాలు పగులగొట్టి..డోర్‌ లాక్‌ ఓపెన్‌చేసి..వామన్‌రావును బయటకు లాగి నరికేశారని అంటున్నాడు డ్రైవర్‌. మేడమ్‌ను కారులోనే చంపేశారని చెబుతున్నాడు. ఉదయం హైదరాబాద్‌ నుంచి పన్నెండున్నర గంటలకు ఇక్కడకు చేరుకున్నామన్నారు. అక్కడే కాపు కాసిన ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారని అంటున్నాడు.

Read also : కుంట శ్రీను. లాయర్ దంపతులు చనిపోతూ చెప్పిన పేరిది. రాజకీయ రచ్చకు ఇదే క్లూ. ఎవరితను.. పుట్టా మధుతో లింకేంటి..?