Hyderabad Drunk and Drive: ఉక్కుపాదం మోపుతున్నా మార్పు రావడం లేదు.. తాగుబోతుల వీరంగానికి యువతి బలి..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Oct 05, 2021 | 7:21 AM

Hyderabad Drunk and Drive: డ్రంకన్ డ్రైవ్ పై చట్టాన్ని ఎంత కఠినతరం చేసినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

Hyderabad Drunk and Drive: ఉక్కుపాదం మోపుతున్నా మార్పు రావడం లేదు.. తాగుబోతుల వీరంగానికి యువతి బలి..
Drunken Drive

Hyderabad Drunk and Drive: డ్రంకన్ డ్రైవ్ పై చట్టాన్ని ఎంత కఠినతరం చేసినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. భారీ జరిమానాలే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం, జైలు శిక్షలు వేస్తున్న పెద్దగా పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్నారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ లతో యాక్సిడెంట్లు చేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు.

పేరేంట్స్ పర్యవేక్షణా లోపం, నిబంధనలకు నీళ్లొదులుతున్న బార్ యాజమాన్యాల నిర్లక్ష్యం.. వెరసి అమాయకుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. డబ్బు సంపాదనలో బిజీగా ఉంటున్న తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారో? కూడా గమినించడం లేదు. దీంతో పేరేంట్స్ పర్యవేక్షణ కరువై యువత అడ్డదారులు తొక్కుతోంది. ఇందులో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు చాలా మంది ఎంజాయ్‌మెంట్ పేరుతో చెడు అలవాట్లకు బానిసవుతోంది. అందుకు నిదర్శనం సిటీలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. ఇందులో ఎక్కువ మంది యువత తాగిన మైకంలో వెహికిల్ ర్యాష్ డ్రైవ్ చేస్తూ వారి ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను తీస్తున్నారు.

సోమవారం ఉదయం మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సీఐఐ జంక్షన్ వద్ద ఆగివున్న బైక్‌ను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో అజయ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ సైనిక్‌పురిలో నివాసం ఉండే అజయ్, జెన్నిఫర్ డిక్రూజ్ మాదాపూర్ ఐటీ జోన్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఈ మధ్యే వారిద్దరికీ పెళ్లి సంబంధం కుదరగా.. పెద్దల సమక్షంలో ఘనంగా నిశ్చితార్ధం జరిగింది. త్వరలో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే శనివారం అజయ్, జెన్నిఫర్ గచ్చిబౌలిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనంపై కొత్తగూడ వైపు నుంచి సైబర్ టవర్ వైపు వెళుతుండగా.. సీఐఐ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో బైక్ ఆపారు. ఇంతలో వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ కారు బైక్ ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరూ కిందపడిపోయారు. జెన్నిఫర్ తలకు బలమైన గాయాలు కావడంతో సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే‌ ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. బైక్ నడుపుతున్న అజయ్ ఎడమ చేయి, ఎడమ కాలు, వెన్నముకకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం కొండాపూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. స్పాట్‌లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌తో పాటు ప్రత్యేక్ష సాక్ష్యుల వద్ద వివరాలు సేకరించారు. కారు నంబర్ ఆధారంగా వివరాలు రాబడితే ప్రమాదానికి కారణమైంది సృజన్ కుమార్‌గా గుర్తించారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తే కొండాపూర్ లోని ఓ ఫ్లాట్ లో వీరంతా పార్టీ చేసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. ప్రమాదానికి కారణం అయిన సృజన్‌పై 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయనున్నారు పోలీసులు.

డ్రంకెన్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరిస్తున్న ఇలాంటి రోడ్డు ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ‘‘ఇప్పటికైనా తాగి వాహనాలు నడిపకండి.. ఎదుటి వారి ప్రాణాలు తీయకండి..’’ అంటూ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also read:

IPL 2021: ఐపీఎల్‌ ఆరేంజ్‌ క్యాప్‌ రేస్‌..! కేఎల్ రాహుల్ కింగ్‌ ఆఫ్ ద నెంబర్‌ వన్‌..

IPL 2021: పర్పుల్‌ క్యాప్‌ రేసులో ఇప్పటికి అతడే నెంబర్ వన్.. మిగతావారి స్థానం ఎలా ఉందంటే..?

ఇండియాలో ఈ 5 ప్రదేశాలు మంచి పర్యాటక కేంద్రాలు..! ప్రతి ఒక్కరూ చూడదగినవి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu