Honor killing: పార్టీ ఇస్తాం దా అని పిలిచారు.. ఆపై ప్రాణాలే తీసేశారు.. నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ కథ..!
Crime News: పార్టీ ఇస్తామంటూ బయటకు తీసుకువెళ్లి ఓ యువకుడిని కొట్టి చంపేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడులో
Crime News: పార్టీ ఇస్తామంటూ బయటకు తీసుకువెళ్లి ఓ యువకుడిని కొట్టి చంపేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడులో చోటుచేసుకుంది. అయితే, యువకుడి మృతి వెనుక ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోంది. బాధిత యువకుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లపాడుకు చెందిన బండారు ఫణి గోపి, అదే గ్రామానికి చెందిన అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు 6 నెలల క్రితం వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్లో అబ్బాయిపై ఫిర్యాదు చేశారు. కేసు విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతని స్నేహితులు పార్టీ ఇస్తామని చెప్పి ఫణి గోపిని బయటకు తీసుకువెళ్లారు. అలా వెళ్లిన ఫణి గోపి తెల్లవారినా ఇంటికి రాలేదు. దాంతో వాళ్ళ నాయనమ్మ భయపడి బంధువులకు తెలిపింది. బంధువులు వెళ్లి స్నేహితులను నిలదీయగా మాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దాంతో ఫణి గోపి కుటుంబ సభ్యులు.. అతని స్నేహితులైన సాంబయ్య, నవీన్, శ్రీకాంత్‌ల పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు వారిని తీసుకువచ్చి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. గోపీ ప్రేమించిన అమ్మాయి బంధువులు అతన్ని చంపేందుకు స్కెచ్ వేశారని తేలింది. అమ్మాయి బంధువులయిన చావలి గోపి, చావలి ఎల్లయ్య, తాటి లింగారావులు తమకు రూ.60000 ఇస్తామని చెప్పగా.. ఫణి గోపిని తీసుకువచ్చి వారికి అప్పగించినట్లు పోలీసులకు తెలిపారు. గోపి, ఎల్లయ్యలను విచారించగా ఫణి గోపిని ముళ్లపోదలలోకి తీసుకువెళ్లి కొట్టామని, ఈ క్రమంలో అతను వదిలివేయమని ప్రాధేయపడగా వదిలివెళ్లినట్లు తెలిపారు. తర్వాత ఏమిజరిగిందో తమకు తెలియదని తెలిపారు. ఫణి గోపిని కొట్టేందుకు వారు ఉపయోగించిన కర్రలను, బడిశను పోలీసులకు అప్పగించారు. కానీ, ఎక్కడో తేడా కొడుతుండటంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దాంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. ఫణి గోపిని కండువాతో గొంతు నులిమి చంపి ద్విచక్రవాహనంపై తీసుకువచ్చి ముట్లూరు గ్రామం వద్ద కృష్ణ కాలువలో పడేసినట్లు వెల్లడైంది. పోలీసులు వెళ్లి చూడగా కాలువలో మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం రిపోర్ట్ కొరకు గుంటూరు మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Telangana CM: ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమనసు.. అరుదైన వ్యాధి చికిత్సకు రూ.25 లక్షలు మంజూరు..
గేల్, రస్సెల్, మ్యాక్స్‌వెల్‌ను మించిపోయాడు.. సిక్సర్ల రారాజుగా అవతరించాడు.. ఎవరో తెలుసా.?