AP: గతంలో కాలేజ్ ప్రిన్సిపాల్.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ఇలా ఎందుకు మారాడంటే..?
మంచి చదువు చదివాడు. మంచి ఉద్యోగమే సంపాదించాడు. కానీ జల్సాలకు అలవాటుపడ్డాడు. అందుకోసం కష్టపడి సంపాదించే డబ్బు సరిపోదు. దీంతో ఈజీ మనీ కోసం దారి తప్పాడు.
Guntur District: మంచి చదువు చదివాడు. మంచి ఉద్యోగమే సంపాదించాడు. కానీ జల్సాలకు అలవాటుపడ్డాడు. అందుకోసం కష్టపడి సంపాదించే డబ్బు సరిపోదు. దీంతో ఈజీ మనీ కోసం దారి తప్పాడు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి. అతని పేరు శ్రీనివాస్.. హైదరాబాద్(Hyderabad) లోని కార్పొరేట్ కాలేజ్ లో ప్రిన్సిపాల్ గా పని చేశాడు. మొదటి దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కిన వారికి బెయిల్ ఇప్పించేవాడు. క్రమంగా వారికే పెట్టుబడి పెట్టి దొంగతనాలు చేయించాడు. చివరికి తానే దొంగగా మారి పోలీసులకు చిక్కాడు. ముప్పెకి పైగా కేసుల్లో నిందితుడిగా ఉండి జైలు శిక్ష అనుభవించాడు. జైలులో ఉండగానే హైదరాబాద్‌కు చెందిన కిరణ్ పరిచయం అయ్యాడు. కిరణ్ 125 పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాద్‌లో కిరణ్‌పై సస్పెక్ట్ షీట్ ఉంది. జైలులో ఏర్పడిన పరిచయంతో ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. కేవలం సోమవారం నుండి గురువారం వరకే దొంగతనాలు చేస్తారు. పగటి పూట బైక్‌పై తిరుగుతూ తాళం వేసి ఉన్న అపార్ట్మెంట్స్‌లోని ప్లాట్స్ ను టార్గెట్ చేస్తారు. వాచ్ మెన్ తో ఒకరు ముచ్చట్లాడుతుండగా మరొకడు దొంగతనం చేసుకు వస్తాడు. హైదరాబాద్ తో పాటు ఏపిలోని కాకినాడ, వైజాగ్(Vizag), రాజమండ్రి, తణుకు, గుంటూరుల్లో వీరిద్దరూ దొంగతనాలు చేశారు. తాజాగా వీరిని అదుపులోకి తీసుకున్న గుంటూరు అర్బన్ పోలీసులు… సుమారు నలభై లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, రెండు కేజీల వెండి ఆభరణాలు, ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దొరికిందే ఇంత అంటే.. వీరు ఇప్పటి వరకు ఏ రేంజ్‌లో దొంగతనాలు చేశారో అర్థం చేసుకోవచ్చు. వీక్ డేస్‌లో దొంగతనం చేసి.. వీకెండ్స్‌లో గోవాలోని క్యాసినోల్లో జూదం ఆడే ఈ కిలాడీ దొంగలు ఇప్పుడు చిప్పకూడు తింటున్నారు.
రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.
Also Read: AP: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..