Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్యకేసులో కీలక మలుపు.. ఎంపీ అవినాష్‌రెడ్డి సిబ్బందిని విచారించిన సీబీఐ

ఒక హత్య.. 9 కోట్ల డీల్.. 9మంది వ్యక్తుల ప్రమేయం..! ఏపీలోనే బిగ్గెస్ట్ మర్డర్ మిస్టరీ.. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యలో సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్యకేసులో కీలక మలుపు.. ఎంపీ అవినాష్‌రెడ్డి సిబ్బందిని విచారించిన సీబీఐ
Ys Viveka Murder Case
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 10, 2021 | 8:25 PM

YS Viveka Murder Case Mystery: ఒక హత్య.. 9 కోట్ల డీల్.. 9మంది వ్యక్తుల ప్రమేయం..! ఏపీలోనే బిగ్గెస్ట్ మర్డర్ మిస్టరీ.. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యలో సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వివేకా ఇంటికి వాచ్‌మన్‌గా ఉన్న రంగయ్య నోరు విప్పాడో లేదో మూడు పేర్లు బయటపడ్డాయి. ఆ ముగ్గురు ఎవరు.. వాళ్లు కాకుండా బయటపడని పేర్లు ఇంకెన్ని? ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక నుంచీ మరో లెక్క అన్నట్లున్న వివేకా కేసు దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలోనే సీబీఐ దూకుడు పెంచింది. మంగళవారం పులివెందుల గెస్ట్‌హౌస్‌లో 8మందిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి వ్యక్తిగత సిబ్బంది రాఘవరెడ్డి, రమణారెడ్డి, హోంగార్డు నాగభూషణం, బాలకృష్ణారెడ్డి, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లి, సస్పెన్షన్‌లో ఉన్న సీఐ శంకరయ్యను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే విషయంపై సీబీఐ అధికారులు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన వైఎస్ వివేకా హత్యకేసు ఛేదనలో ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు సీబీఐ అధికారులు. అయితే, గత రెండు రోజులుగా వివేకాను హత్య చేయడానికి నిందితులు వాడిన మారణాయుధాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. కడప జిల్లా పులివెందులలోని రోటరీపురం వద్ద ఉన్న వాగులో మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కోసం ఉపయోగించిన మారణాయుధాల కోసం సీబీఐ అధికారులు అన్వేషించారు. ప్రోక్లైన్ సహాయంతో వాగులో ఉన్న బురదను తీసివేసి మారణాయుధాల కోసం శ్రమించారు మున్సిపల్ కార్మికులు. తవ్వేకొద్దీ వస్తున్న బురదతో మారణాయుధాల అన్వేషణ మరింత ఆలస్యమైంది.

వివేకానంద రెడ్డి హత్య అనంతరం నిందితులు ఆయుధాలను వాగులో పడేశారనే సమాచారంతో సీబీఐ అధికారులు అన్వేషణ ప్రారంభించారు. ఆ ఆయుధాలు లభిస్తే కేసులో పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఆయుధాలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు సమకూర్చారు, ఎందుకు ఇచ్చారు అనే అన్ని విషయాలపై ఇప్పడిప్పుడే స్పష్టత వస్తుంది. దీంతో ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది అనేదానిపైనా సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు. హత్యకు ఏ ఆయుధాలు ఉపయోగించారు అనేది కూడా ఇవి దొరికితే తేలనుంది.

ఇదిలావుంటే, 2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సిబిఐ అధికారులు సేకరించారు. 2019 మార్చి 20న వైఎస్ వివేకా కూతురు సునీత ప్రెస్ మీట్ పెట్టారు. విచారణ పారదర్శకంగా జరగాలని కోరారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పులివెందుల పోలీసులు 2019 మార్చి 28న ముగ్గుర్ని అరెస్టు చేశామని ప్రకటన చేశారు. అయితే, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని 28 జనవరి 2020లో వివేకా కూతురు సునీత పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని 2020 జనవరి 28న హైకోర్టు ప్రశ్నించింది. కాగా, 11 మార్చి 2020న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు అప్పగించింది. అప్పటి నుంచి పలు దఫాలుగా కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారిస్తోంది.

అయితే, తాజాగా వివేకానంద రెడ్డి వాచ్‌మన్‌ రంగయ్య ఇచ్చిన సమాచారంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.. పులివెందులతో 16 ఏళ్లు, వివేకా ఇంటితో 2 ఏళ్ల అనుబంధం ఉన్న వ్యక్తి. వివేకానంద రెడ్డి బతికి ఉండగా చూసిన ఆఖరి వ్యక్తి, మర్డర్‌కి గురైన తర్వాత చూసిన మొదటి వ్యక్తి కూడా రంగయ్యే. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు, మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాగ్మూలమే కేసులో హైలైట్‌. మొత్తం 9 కోట్ల సుపారీతో.. 9మంది ప్రమేయంతో వివేకా హత్య జరిగిందన్నది ఇప్పటి వరకూ ఉన్న సమాచారం. ఆ తొమ్మిది మందిలో బయటపడ్డ మూడు పేర్లు.. ఒకటి ఎర్ర గంగిరెడ్డి, రెండు సునీల్‌ యాదవ్‌, మూడు దస్తగిరి. ఇంతకీ ఈ మూడు పేర్లు నిజమేనా? అయితే, మెజిస్ట్రేట్ ముందు వాగ్మూలం తర్వాత కూడా ఓసారి విచారించి ఇంటికి పంపిన సీబీఐ.. అతని ప్రాణానికి పూర్తి రక్షణ ఇస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. రంగయ్యలో మాత్రం భయం తగ్గినట్లు కనిపించడంలేదు. ఎర్రగంగిరెడ్డి పేరును ప్రధానంగా వినిపించిన ఆయన మెజిస్ట్రేట్‌ ముందు ఏం చెప్పారంటే మాత్రం ఒక్కోసారి ఆచితూచి స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also…  AP Municipal Elections: ఏపీలో మరోసారి ఎన్నికల సందడి.. కసరత్తు మొదులుపెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం!