అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్ రాణాకు భారీ షాక్.. క్యాస్ట్ సర్టిఫికెట్‌ను రద్దు చేసిన కోర్టు
MP Navneet Kaur: అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, నటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. అంతే కాదు రూ.2లక్షల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు....
అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, నటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. అంతే కాదు రూ.2లక్షల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. దీంతో ఆమె ఎంపీ పదవి కూడా ఇప్పుడు డేంజర్ జోన్‌లో పడింది. నవనీత్ కౌర్ నకిలీ పత్రాలతో ఎస్సీ కుల ధ్రవీకరణ పత్రం పొందారని శివసేన మాజీ ఎంపీ ఆనందరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా ఇది తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంగా బాంబే హైకోర్టు గుర్తించింది. ఈ మేరకు తీర్పునిచ్చిన ధర్మాసనం.. రూ.2లక్షల జరిమానా చెల్లించి.. ఆరు వారాల్లోగా అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించింది. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. నవనీత్ నకిలీ సర్టిఫికెట్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిపించారని ఆనందరావు ఆరోపించారు.
నవనీత్ 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎన్‌సీపీ తరఫున పోటీ చేయగా.. ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా.. శివసేన అభ్యర్థి ఆనందరావుపై విజయం సాధించారు. నవనీత్ అమరావతిలో బద్నేరాకు చెందిన ఎమ్మెల్యే రవి రాణా భార్య. కన్నడ చిత్రం ‘దర్శన్ ’చిత్రంతో నవనీత్ సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగులో తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మితో పాటు పలు చిత్రాల్లో నటించారు.