Ganja Nursery: విల్లాలో గంజాయి సాగు.. ఎంబీఏ కోసం భారత్‌కు వచ్చి రూ.కోట్లల్లో వ్యాపారం.. చివరకు..
Ganja Seized: భారత్‌కు వచ్చిన ఓ విదేశీ విద్యార్థి ఎలాగైనా అడ్డదారిలో సంపాదించాలనుకున్నాడు.. దానికోసం గంజాయి సాగును ఎంచుకున్నాడు. పెద్ద మొత్తంలో చెల్లించి ఓ విల్లాను అద్దెకు
Ganja Seized: భారత్‌కు వచ్చిన ఓ విదేశీ విద్యార్థి ఎలాగైనా అడ్డదారిలో సంపాదించాలనుకున్నాడు.. దానికోసం గంజాయి సాగును ఎంచుకున్నాడు. పెద్ద మొత్తంలో చెల్లించి ఓ విల్లాను అద్దెకు తీసుకున్నాడు. ఆ విల్లానే గంజాయి వనంగా మార్చాడు.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్ అయింది. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ షాకింగ్ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. విల్లాలో పోలీసులు, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ తనిఖీలు చేసి రూ.కోటి విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ రాకెట్‌లో ఇద్దరు ఇరాన్ జాతీయులతో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి కోటి విలువైన 130 హైడ్రో గంజాయి మొక్కలు, 12.8 కిలోల హైడ్రో గంజాయి పొడి, ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్‌లు ఉన్నాయి.
ఆర్‌టి నగర్‌లోని కావేరినగర్‌లో ఆదివారం ఒక ముఠా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తనకు సమాచారం అందడంతో.. దాడులు చేశామని పోలీసు ఇన్‌స్పెక్టర్ దీపక్ తెలిపారు. డ్రగ్స్‌తో కారులో కస్టమర్ కోసం ఎదురుచూస్తుండగా పోలీసు బృందం నలుగురిని పట్టుకుందని తెలిపారు. అనంతరం విచారణ జరపగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఉండే ఇంటిని పరిశీలించి పోలీసులు అవాక్కయ్యారు. ఇరాన్‌కు చెందిన జావెద్ బిడది సమీపంలోని తన విల్లాలో ఎల్‌ఈడీ దీపాల వెలుగులో హైడ్రో గంజాయి సాగు చేస్తున్నట్లు సీసీబీ అధికారులు గుర్తించారు. ఆయనతోపాటు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చిన జావెద్.. కాలపరిమితి ముగిసినా ఇక్కడే అక్రమంగా ఉంటున్నాడు. గతంలో బాణసవాడిలో హైడ్రో గంజాయి సాగు చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా బిడది సమీపంలోని విల్లాను నెలకు రూ.36 వేలు రెంట్ చెల్లిస్తూ ఏడాదిన్నరగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. యూరప్ నుంచి విత్తనాలు తెప్పించుకుని సాగు ప్రారంభించాడని.. విల్లాలో 130 హైడ్రో గంజాయి మొక్కలు ఉన్నాయని తెలిపారు. అయితే.. హైడ్రో గంజాయి మొక్కలు సూర్యకాంతి తగలని ప్రాంతాల్లోనే పెరుగుతాయిని.. దీనికోసం అల్ట్రావైలెట్ దీపాలు, ఎల్‌ఈడీ దీపాలు, ఏసీలు అమర్చినట్లు సీసీబీ జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ వెల్లడించారు.
నిందితుడు.. హైడ్రో గంజాయి సాగుపై వెబ్‌సైట్లలో చదివి, ప్రత్యేకంగా పుస్తకాలు కొనుగోలు చేసి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చేపల తొట్టెల్లో గంజాయిని సాగుచేస్తూ.. దానిని విద్యార్థులు, పార్టీలకు వెళ్లే వారికి విక్రయించేవాడని తెలిపారు. ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశామని మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: