AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Murder Case: యువ వ్యాపారవేత్త రాహుల్‌ హత్య కేసులో మరో ట్విస్ట్.. మరో నలుగురు నిందితుల అరెస్ట్‌!

సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్‌ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ దారుణానికి ఒడిగట్టిన మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Rahul Murder Case: యువ వ్యాపారవేత్త రాహుల్‌ హత్య కేసులో మరో ట్విస్ట్.. మరో నలుగురు నిందితుల అరెస్ట్‌!
Rahul Murder Case
Balaraju Goud
|

Updated on: Aug 29, 2021 | 8:27 PM

Share

Businessman Rahul Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్‌ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ దారుణానికి ఒడిగట్టిన మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతయ్య, బాబురావు, రాజబాబు, కరణం రమేష్‌లను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, కేసుకు సంబంధించి ఇప్పటివరకు 13 మందిలో 11 మంది నిందితులు అరెస్ట్‌ అయ్యారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

విజయవాడకు చెందిన యువ పారిశ్రామికవేత్త రాహుల్‌ హత్య ప్లాన్ ప్రకారమే జరిగిందని తేల్చారు పోలీసులు. ఆయన్ను హత్య చేసే ముందు.. కారులో కొట్టి.. కొన్ని పేపర్లపై సంతకాలు చేయించుకున్నట్టు తేల్చారు. మర్డర్‌ ముందు.. రాహుల్‌ కారులో తరలించే సీసీటీవీ దృశ్యాలు పోలీసులు విడుదల చేశారు. డబ్బులు ఇవ్వకుండా, షేర్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయకుండా రాహుల్‌ కాలయాపన చేస్తుండటంతో.. కోగంటి సత్యం, కోరాడ విజయ్‌కుమార్‌ ఒకటి రెండు సార్లు రాహుల్‌ను బెదిరించారు. ఈ నెల 18న రూ. 50 లక్షలు ఇస్తానని గాయత్రికి చెప్పి రాహుల్‌ సీతారాంపురంలోని చిట్‌ఫండ్స్‌ ఆఫీస్‌కు తన కారులో బయలుదేరారు. అయితే, ప్లాన్ ప్రకారం రాహుల్‌ను వేరే కారులో తీసుకెళ్లారు. రాహుల్‌ను కారులోని ముందు సీట్లో కూర్చోబెట్టి.. ఛార్జర్‌ వైర్‌తో వెనక నుంచి మెడకు బిగించి హత్య చేశారని విజయవాడ పోలీసు కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు.

కోరాడ విజయ్‌కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్‌ఫండ్‌ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్‌ఫండ్‌ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్‌కుమార్‌ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్‌ సిలిండర్స్‌ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్‌కుమార్‌ రాహుల్‌ను కోరాడు.

అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్‌పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్‌కుమార్‌ స్నేహితురాలు గాయత్రికి రాహుల్‌ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్‌ సిలిండర్స్‌ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్‌ బిజినెస్‌లో కాంట్రాక్ట్‌ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో రాహుల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్‌ హత్యకు దారితీశాయి.

Read Also…  500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?