Crime News: మామూలు ప్లాన్ కాదు.. ఎమ్మెల్యేల పేరు చెప్పి వసూళ్లు.. చివరకు అడ్డంగా బుక్కై..
Andhra Pradesh Crime: రౌడీలు మామూళ్లు వసూలు చేస్తారు.. రాజకీయ నాయకులు చందాలు తీసుకుంటారు. కానీ ఫర్ ఏ చేంజ్ ఈ ఫోటోలో ఉన్న అతను

Andhra Pradesh Crime: రౌడీలు మామూళ్లు వసూలు చేస్తారు.. రాజకీయ నాయకులు చందాలు తీసుకుంటారు. కానీ, ఫర్ ఏ చేంజ్.. ఈ ఫోటోలో ఉన్న అతను రౌడీ కాదు, అంతకన్నా రాజకీయ నేత కాదు. అయినా డబ్బులు మాత్రం వసూలు చేస్తాడు. ఎవరి పేరు చెబితే సగటు వ్యాపారులు భయపడతారో.. ఆయా ఎమ్మెల్యేల పేరునే వాడేస్తాడు. కరోనా భాదితులకు ఎమ్మెల్యే సేవ చేస్తున్నారని.. దానికి ఆర్థిక సాయం చేయాలంటూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేరుతో ఒక వ్యక్తి డబ్బులు వసూలు చేయటం చర్చనీయాంశంగా మారింది. అయితే.. బాధితుల్లో సామాన్య వ్యక్తులతోపాటు నర్సాపురం మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు సైతం ఉండటం గమనార్హం..
వివరాల్లోకి వెలితే.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మేల్యేలు పేరు చెప్పి వ్యాపారస్థుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మేడికొండ శ్రీనివాస్‌ను పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతని నుంచి రూ.పది వేలు స్వాదీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ పట్టణంలోని వ్యాపారస్థుల నుంచి కరోనా బాధితుల సహాయార్థం ఎమ్మేల్యే నిమ్మల రామానాయుడు డబ్బులు వసూలు చేయమన్నారని వసూళ్లకు పాల్పడ్డాడు. ఇలా వసూళ్లు జరుపుతుండగా.. అనుమానం వచ్చిన వ్యాపారస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. ఎమ్మేల్యేల పేరు చెప్పి వ్యాపారస్థుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు విచారణలో తేలింది. అంతేకాక గతంలోనూ శ్రీనివాస్ నరసాపురంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పేరు చెప్పి.. లంక అగ్ని ప్రమాద బాధితుల సహాయార్థంగా బంగారు వ్యాపారస్థుల నుంచి 60 వేల రూపాయలు వసూలు చేశాడు. అనుమానం వచ్చిన కొందరు వ్యాపారస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు బయటకు వచ్చిన శ్రీనివాస్ మళ్లీ పాలకొల్లులో దుకాణం మొదలు పెట్టాడు. ఎమ్మెల్యే నిమ్మల పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ మళ్లీ పోలీసులకు చిక్కాడు. అయితే.. శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారు.
బి.రవి కుమార్, TV9 తెలుగు రిపోర్టర్, పశ్చిమగోదావరి జిల్లా.
Also Read: