తెలంగాణలో కరోనా సెకండ్‌వేవ్ కలకలం.. వైరస్ బారిన పడుతున్న పాఠశాలల విద్యార్థులు
తెలంగాణలో స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో కరోనా వైరస్ తిష్ట వేసినట్లుగా కనిపిస్తోంది. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
school students tested corona positive : తెలంగాణలో స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో కరోనా వైరస్ తిష్ట వేసినట్లుగా కనిపిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా భైంసాలోని మహాత్మజ్యోతిరావుపూలే బాలుర గురుకుల పాఠశాలలో 25మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మొత్తం 176మందికి టెస్ట్‌లు చేయగా.. అందులో 25మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే గురుకుల పాఠశాలలో 24గంటల క్రితం 9మంది విద్యార్థులు వైరస్ బారిన పడటంతో మొత్తం బాధితుల సంఖ్య 34కి చేరింది. మరోవైపు, స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో కేసులు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తరగతి గదులను శానిటైజ్ చేసి, కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి కరోనా కలకలం రేగింది. శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో కొందరికి జ్వరం లక్షణాలు ఉండడంతో అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న 48 మందికి కరోనా టెస్టులు చేయించగా ఇద్దరు విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని హెడ్‌మాస్టర్ తెలిపారు. వెంటనే ఆ ఇద్దరినీ హోం ఐసోలేషన్‌కు తరలించామని తెలిపారు.
ఇక నగర శివారులోని రాజేంద్రనగర్ బాలుర హాస్టల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హాస్టల్ వార్డెన్‌తో పాటు వాచ్మెన్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అవడంతో వెంటనే వైద్య సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్ వచ్చిన వారి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. కరోనా పాజిటివ్ అని తేలడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అటు, యాదాద్రి జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజపేట బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదుగురు విద్యార్థులతో పాటు హెడ్‌మాస్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో పాఠశాలను మూసివేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచారు. వైద్యాధికారులు రంగంలోకి దిగి వారితో కాంటాక్ట్ అయిన విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇదిలావుంటే, తెలంగాణలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గలేదన్నారు రాష్ట్ర ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు. అయితే ప్రజలు కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం తప్పదంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మనకు వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని డీహెచ్ఎంవో శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండిః ఉధృతమవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం.. మద్దతు ప్రకటించిన రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్