Prakasam District: కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఇకపై మరింత కఠిన చర్యలు.. స్పష్టం చేసిన ప్రకాశం జిల్లా అధికారులు
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపధ్యంలో ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూను సడలిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. అయితే ప్రకాశం జిల్లాతో పాటు మరో నాలుగు జిల్లాల్లో...
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపధ్యంలో ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూను సడలిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. అయితే ప్రకాశం జిల్లాతో పాటు మరో నాలుగు జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో… ఈ ఐదు జిల్లాల్లో నిబంధనలు యధాతథంగా జూలై 7వరకు కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో గత 14 రోజుల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే 10,771 నమూనాలు పరీక్షించగా అత్యధికంగా ఒంగోలులో 43, ఒంగోలు రూరల్‌లో 27, కొత్తపట్నంలో 23 కేసులు వెలుగుచూశాయి. పదికి పైగా పాజిటివ్ కేసులొచ్చిన మండలాలు 12 ఉన్నాయి. సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో అయిదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 923 కి చేరింది. ప్రస్తుతం జిల్లాలో 4,690 మంది వ్యాధితో కొనసాగుతున్నారు. బ్లాక్ ఫంగస్‌తో కొత్తగా నలుగురు జీజీహెచ్‌లో చేరారు. 23,201 మందికి టీకాలు వేశారు.
థర్ద్‌వేవ్ రాకుండా కట్టడి చర్యలు….
జిల్లాలో కరోనా థర్డ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వారంలో మూడు రోజులపాటు సచివాలయ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో ఇంకా సెకండ్‌వేవ్ కొనసాగుతుందన్నారు. ఆ కేసులను దృష్టిలో పెట్టుకొని థర్డ్ వేవ్‌కు ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ బెడ్స్, సాధారణ బెడ్స్‌తోపాటు ఆక్సిజన్ నిల్వపై ప్రణాళికలు రూపొందించి వైద్య ఆరోగ్యశాఖకు పంపామన్నారు. అలాగే వ్యాక్సిన్ కూడా ముఖ్యమన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సోమవారం నో మాస్క్-నో ఎంట్రీ అనే నినాదంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, రెస్టారెంట్లు, హోటల్స్, మాల్స్, పెద్ద పెద్ద సంస్థల్లో ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రతి మంగళవారం నో మాస్క్-నో రైడ్స్ నినాదంతో ఆటోలు, బస్సులు, టాక్సీలు, అన్ని వాహనాల్లో పాటింపు, ప్రతి బుధవారం నో మాస్క్- నో సేల్ అనే నినాదంతో చిన్న చిన్న దుకాణాలు, రోడ్డు పక్కన ఉన్న కూరగాయల దుకాణాలు, షాపులు, బజార్లలో యజమానులు, పనిచేసే వారు పాటించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరోవైపు కరోనా ఆంక్షలను ఒంగోలులో కఠినంగా అమలు చేస్తున్నామని ఎస్‌పి శిద్దార్ద్ కౌశల్ తెలిపారు. కరోనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 77,253 కేసులు నమోదు చేసి 28,265 చలానాలు రాసినట్లు తెలిపారు. ఎటువంటి పనులు లేకుండా బయటకు వచ్చేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు… రవాణాశాఖ కార్యాలయానికి ఇతర ప్రాంతాలనుంచి ఎక్కువగా ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో కార్యాలయంలోకి ఎంట్రీ కావాలంటే తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది… అందులో భాగంగా ఒంగోలు ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో కరోనా పరీక్షలు చేస్తున్నారు… వివిధ పనుల నిమిత్తం వచ్చేవారిలో ఎక్కువగా యువకులు ఉండటం వల్ల వారికి తప్పని సరిగా కరోనా పరీక్షలు చేస్తున్నారు… ప్రత్యేక వైద్యబృందాన్ని రవాణాశాఖ ఆవరణలో ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు… రవాణాశాఖ కార్యాలయానికి ఎల్‌ఎల్‌ఆర్‌లు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లకు వచ్చేవారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల ఉద్యోగులకు భద్రత లభిస్తుందని రవాణాశాఖ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు… నో టెస్ట్… నో ఎంట్రీ నినాదంతో సందర్శకులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Also Read: తెలంగాణ మంత్రుల కామెంట్స్‌కు.. తొలిసారి ఘాటుగా బదులిచ్చిన ఏపీ మంత్రి బొత్స